వర్షం | ఫణీంద్ర కుప్పిలి
వర్షం | ఫణీంద్ర కుప్పిలి
వర్షం నెమ్మదిగా మొదలైంది..
చిన్న తుంపర్లుగా పడుతోంది..
గుండెలోని బాధ తన్నుకొస్తుంటే
జాలువారే కన్నీళ్ళు లాగా..
శ్రమజీవి చెమట చుక్కలు ఆవిఅరై
తిరిగి అవని మీద కురుస్తున్నట్లుగా..
వర్షం జోరు అందుకుంది
మనం పుడమి తల్లిపై చేస్తున్న అకృత్యాలను
చూసి గుండెలవిసేలా ఏడుస్తున్నట్టు
భోరుమని వర్షం కురుస్తోంది..
మధ్య మధ్యలో వెక్కిళ్లు పెడుతున్నట్లు
ఉరుములతో ఉక్కిరిబిక్కిరవుతోంది..
గుండెలోని బాధ తీరిన తర్వాత
అలసి సొలసి సొమ్మగిల్లినట్లు
మేఘం మూతి ముడుచుకుని కూర్చుంది..
అప్పటి వరకు గర్జించిన ఆకాశం
విషాదం నుండి కోలుకున్న మనిషిలా
ఇపుడు నిర్మలంగా ఆహ్లాదంగా కనిపిస్తోంది
తనలోని భిన్న పార్శ్వాలను చూపిస్తూ
హరివిల్లుతో కనువిందు చేస్తోంది..
21.06.2026