Posts

Showing posts from 2026

సముద్రం.. | ఫణీంద్ర కుప్పిలి

  సముద్రం.. | ఫణీంద్ర కుప్పిలి  ​వెండి వెన్నెల వేళ.. అల్లరి చందమామతో సయ్యాటలాడుతూ ఎంతో సొగసుగా ఊసులెన్నో చెబుతుంది! ప్రేమికుల శ్వాసల్లోని వెచ్చదనాన్ని.. తన పైరగాలిలో వెదజల్లుతూ మనసులను గమ్మత్తుగా కట్టిపడేస్తుంది! ​సమస్త జీవకోటినీ.. అంతులేని రహస్యాల్ని తన అగాధ గర్భంలో దాచుకుని.. పైకి మాత్రం నిష్కామ యోగిలా ఎంతో గంభీరంగా కనిపిస్తుంది! ​కానీ..  దాన్ని అలుసుగా తీసుకుని మానవుడు గీత దాటిన మరుక్షణం.. రాకాసి అలలతో అమాంతం విరుచుకుపడుతుంది! తనతో తలపడిన ప్రతీ శక్తినీ తన ప్రవాహంలో కలిపేసుకుంటుంది! ​అప్పటిదాకా జోలపాడిన అలలతోనే  క్షణంలో మృత్యురాగం ఆలపిస్తుంది! 07.06.2026

గాయపరిచే వెలుగు | ఫణీంద్ర కుప్పిలి

గాయపరిచే వెలుగు | ఫణీంద్ర కుప్పిలి  అబద్ధాల అలలు ఎంత ఎగసిపడ్డా సత్యం సముద్రంలా నిశ్చలంగా నిలుస్తుంది.. మేఘాలు సూర్యుణ్ని కప్పినంత మాత్రాన వెలుగు తన ఉనికిని కోల్పోదు.. కాలం కొన్నిసార్లు అసత్యానికి విజయ కిరీటాన్ని తొడిగినా.. చరిత్ర చివరికి సత్యానికే జయధ్వజాన్ని ఎగురవేస్తుంది.. ​మాయ మాటల మైకంలో  మనసు క్షణకాలం మురిసిపోవచ్చు.. కానీ గాయపరిచే నిజం మాత్రమే  నిదురిస్తున్న ఆత్మను మేల్కొలుపుతుంది.. 30.05.2026

సముద్రం | ఫణీంద్ర కుప్పిలి

  సముద్రం | ఫణీంద్ర కుప్పిలి  ​పడి లేస్తూ.. లేచి పడుతూ.. తీరాన్ని తాకాలన్న ఏకైక తపనతో అలుపెరుగని కాల గమనంలా, ఫలాపేక్ష లేని నిష్కామ యోగిలా.. నిరంతరం, నిర్విరామంగా తనను తాను పునర్నిర్మించుకుంటూనే ఉంటుంది.. ​మనిషీ  కాలం విసిరే గాయాల రాళ్ళను అనుభవాల ముత్యాలుగా మార్చుకుంటూ.. అవమానాల సుడిగుండాల నుండి ఆత్మగౌరవ తీరానికి చేరాలని నిత్యం తపిస్తాడు.. ​ఎందరో వదిలివెళ్ళిన స్మృతుల శిథిలాలను హృదయ గర్భంలో నిశ్శబ్దంగా దాచుకుని, ఉపరితలంపై మాత్రం అనంత ప్రశాంతతను నటిస్తాడు. ​ఎన్ని తుఫానులు విరుచుకుపడ్డా, ఎన్ని తీరాలు దూరమై వెక్కిరించినా.. అతడు ఆగడు, ఆగలేడు.. సముద్రానికి తరంగమేదో.. మనిషికి చైతన్యమది.. ప్రయాణమే తన స్వభావమని, పోరాటమే తన ఉనికికి పరమార్థమని.. సముద్రపు లోతుల్లో దాగున్న మౌనానికి తెలిసినట్టే, మనిషి ఆత్మకూ తెలుసు.. 28.05.2026

చీకటి తర్వాత…| ఫణీంద్ర కుప్పిలి

చీకటి తర్వాత…| ఫణీంద్ర కుప్పిలి  చీకటి తర్వాత వెలుగు వస్తుంది.. కానీ వేకువ భారాన్ని మోయలేని కొన్ని భుజాలు రాత్రిలోనే విరిగిపోతాయి. ఓటమి విజయానికి తొలి మెట్టు అంటారు.. కానీ కన్నీటి మట్టిలో నడిచేవాడికి ప్రతి అడుగూ ఒక అగాధమే.. ఆదర్శాలు ఎండమావులై పిలుస్తాయి.. పరుగెత్తి చేరేసరికి ఖాళీ చూపులే మిగులుతాయి.. ఆశ అనే సన్నని దారాన్ని పట్టుకుని నిరాశ అగాధంలో మనిషి వేలాడుతూనే ఉంటాడు.. దారమూ తెగదు..నేలకూ తగలదు.. జనన మరణాల ఈ కాలచక్రం విముక్తి కోసం కాదు.. తిరగడం మాత్రమే తెలిసిన గుడ్డి గుర్రంలా సాగుతుంది.. అవును, వెలుగు వస్తుంది.. కానీ అది ఆరిపోయిన దీపాన్ని వెలిగించదు.. కాలిపోయిన సత్యాలను చూపే నిలువుటద్దమై మిగులుతుంది.. 19.05.2026

గాయాల చిరునామా | ఫణీంద్ర కుప్పిలి

గాయాల చిరునామా |  ఫణీంద్ర కుప్పిలి తీరం దాటేవరకే వారధి… ఆపై అది జ్ఞాపకాల శిథిలం.. తీయని మాటల వెనుక దాచిన గాయాల చిరునామాలు. అవసరాల అంచున ఆప్యాయతల నాటకం… తెరపడగానే మిగిలేది మౌనపు లోయ.. నమ్మిన గుండెకు మోసం ఎప్పుడూ రక్తస్రావమే. ప్రతి ద్రోహం ముక్కలైన అద్దంలా మనల్ని వెక్కిరిస్తుంది. పరాయివాడి బాణం కంటే… మనవాడి విషపు స్పర్శే ఎక్కువ బాధ. నిశ్శబ్దంగా… ఊపిరిని చిదిమేస్తూ…!! 09.05 .2026

జ్ఞాపకాల తీరంలో | ఫణీంద్ర కుప్పిలి

జ్ఞాపకాల తీరంలో | ఫణీంద్ర కుప్పిలి  ఆలోచనలు ఎడతెరిపి లేకుండా సముద్రపు అలలు వలె అనంతంగా సాగిపోతున్నాయి.. మారిపోయిన బంధాలు.. మరిచిపోయిన అనుబంధాలు.. నీటి పై వృత్తాల్లా చెదిరిపోతుంటే.. ​కాలం అనే ఇసుక తిన్నెపై నిన్నటి అడుగులు చెరిగిపోతున్నాయి.. కనుపాపల వెనుక దాచుకున్న కలలు కన్నీటి ధారల్లో కరిగిపోతున్నాయి.. ​ఎదురుచూపుల తీరంలో ఒంటరిగా.. మౌనమే భాషగా, శూన్యమే తోడుగా.. నిశ్శబ్దం వినిపిస్తున్న ఈ గుండె చప్పుడు ఏ తీరాన్ని చేరుతుందో.. ఏ జ్ఞాపకంలో ఆగుతుందో! 02.05.2026

సముద్రం | ఫణీంద్ర కుప్పిలి

సముద్రం | ఫణీంద్ర కుప్పిలి  అది అనంత సృష్టికి అద్దం.. విశ్రాంతి ఎరుగని ఒక నిరంతర చలనం.. ​ఉవ్వెత్తున ఎగసి పడే ప్రతి అల.. వైఫల్యాన్ని చూసి వెనకడుగు వేయదు.. పడి లేచే ప్రతి కెరటం.. ఓటమిని ఎదిరించే పోరాట పటిమను వీడదు.. ​తీరాన్ని తాకి వెనుదిరిగే ప్రతి తరంగం.. "నేను మళ్ళీ వస్తాను" అనే ఆశావహ సంతకం.. రేపటి సూర్యుడిపై అచంచలమైన నమ్మకంతో సాగర గర్భం చేసే ఒక నిశ్శబ్ద నిరీక్షణం.. ​పైపైన కనిపించే అశాంతి అలజడులను దాటితే.. తన అంతరాళంలో దాచుకున్న అనంత సంపదను.. ప్రకృతి దాచిన కోటానుకోట్ల సృష్టి రహస్యాలను ధైర్యవంతుల ముందే ఆవిష్కరిస్తుంది ఈ కడలి.. 18.04.2026

నిశ్శబ్ద విలయం | ఫణీంద్ర కుప్పిలి

నిశ్శబ్ద విలయం | ఫణీంద్ర కుప్పిలి  ​ఎటు చూసినా వికల రూపాలే.. అస్తిత్వపు అంచున తెగిపడి ఉన్న మేధో తంతువుల శకలాలు.. హృదయం ఒక నిర్జన మరుభూమిగా పరివర్థితమై తనలో తాను నిశ్శబ్దంగా దహించుకుపోతోంది.. ​కాలం పేర్చిన నిశ్చితాభిప్రాయాలన్నీ నిర్దయగా విసిరిన యధార్థపు రాళ్ళ దెబ్బకు తునాతునకలై రాలిపోతున్నాయి.. అంతరంగపు పునాదులపై నిర్మించుకున్న 'ఇజాల' సౌధాలు సత్యపు సుడిగాలిలో పేకమేడల్లా కుప్పకూలుతున్నాయి.. ​ఇక్కడ న్యాయమనేది సార్వత్రికం కాదు.. అది శక్తిమంతుని కరచాలనానికి లొంగిపోయే బానిస.. ధర్మం అనేది ఒక రక్షణ కవచం కాదు.. అది కేవలం బలవంతుని అడుగుజాడల్లో నడిచి వెళ్ళే నీడ మాత్రమే.. 30.03.2026

నిశ్శబ్ద విలాపం | ఫణీంద్ర కుప్పిలి

నిశ్శబ్ద విలాపం | ఫణీంద్ర కుప్పిలి  కొన్నిసార్లు ఆవేశం ఆలోచనను మింగేస్తుంది.. భావోద్వేగాల తుఫాను వివేకపు దీపాన్ని ఆర్పేస్తుంది.. తాత్కాలికమైన ద్వేషాలు  మనసుకు దగ్గరైన వారినే దూరం చేస్తాయి.. ఆవేశం చల్లారిన తర్వాత మిగిలేది నిశ్శబ్దంగా మండే నేరభారం.. నోరు జారిన ఒక మాట.. చిరిగిపోయిన ఒక బంధం.. కన్నీటి చుక్కలతో తుడిచినా చెరగని జ్ఞాపకం.. అహంకారం కళ్లకు ముసుగు కడితే ఆత్మీయుల ఆర్తి కనిపించదు.. గెలిచామనుకునేలోపే మన హృదయమే ఓడిపోతుంది.. కాలం గడిచాక తెలుసుకుంటాం కోల్పోయిన కాలం తిరిగి రాదు, దూరమైన హృదయం మళ్లీ చేరదు.. మిగిలేది ఒక్కటే… మనసును దహించే నిశ్శబ్ద విలాపం.. 13.03.2026

మరీచిక | ఫణీంద్ర కుప్పిలి

మరీచిక | ఫణీంద్ర కుప్పిలి  జన కీకారణ్యంలోని రణగొణ ధ్వనుల మధ్య ఓ గొంతు శ్రావ్యంగా వినిపిస్తుంది.. ఈ గజిబిజి గందరగోళ లోకంలో ఓ మాయ నన్ను లిప్తపాటు స్థానువుని చేస్తుంది.. ఈ జీవన గమనంలో అనేక మంది తారసపడతారు.. కొంతమంది అపరిచితులుగా వెళ్ళిపోతారు.. మరికొంతమంది తన ఉనికిని చాటుతారు.. అతి కొద్ది మంది మాత్రం  అర క్షణంలో సుగంధ పరిమళంలా అల్లుకుపోతారు.. చాలా కాలం పాటు మనసుల్ని పెనవేసుకుపోతారు.. ఆ ఆనందాన్ని ఆస్వాదించేలోపే  మన మనసుల్ని నిర్దాక్షిణ్యంగా చిద్రం చేసి  అంతులేని బాధను మిగిల్చి హఠాత్తుగా అదృశ్యమవుతారు.. ముందు కదలాడే ఆ రూపం.. ఇప్పుడు పట్టుకుందామన్నా చిక్కని మరీచిక.. గుండె గదిలో నిశ్శబ్దంగా పేర్చుకున్న ఆశలన్నీ నేడు ముక్కలై గుచ్చుకుంటున్న గాజు పెంకులు.. ​వారొచ్చిన దారిలో ఇంకా పరిమళం ఆవిరవ్వలేదు కానీ ఆ స్పర్శ మాత్రం శాశ్వతంగా దూరమైంది.. ప్రాణం ఉన్న శవమై తిరుగుతున్నా ఈ జనారణ్యంలో నా మౌనం చేసే రోదన ఎవరికీ వినబడదు.. ​ప్రశ్నార్థకమైన ఈ ఒంటరి ప్రయాణంలో శిలలా మిగిలిపోవడం తప్ప ఏమీ చేయలేను.. మరణం ఇచ్చే గాయం ఒక్క క్షణమేమో కానీ ఈ జ్ఞాపకం ఇచ్చే నరకం.. అనుక్షణం అనుభవించాల్సిందే! 21.01.2026...

తిరుగు ప్రయాణం | ఫణీంద్ర కుప్పిలి

తిరుగు ప్రయాణం | ఫణీంద్ర కుప్పిలి  సంక్రాంతి ముగిసింది.. సంబరాలు ముగిసాయి.. ​మూటకట్టిన ఊరి జ్ఞాపకాలు.. కంట తడిపెట్టిన అమ్మ దీవెనలు.. మళ్ళీ వచ్చే దాకా తోడుండే అయ్య పంపిన అరటి గెలలు.. ​బస్సు కిటికీలోంచి చూస్తుంటే.. దూరంగా జరుగుతున్న ఊరి పొలిమేర.. మళ్ళీ కలుస్తామా అన్నట్టు.. వీడ్కోలు పలుకుతున్న పచ్చని చేలు.. అమ్మ చేతి సద్ది మూట.. నాన్న చెప్పిన జాగ్రత్తల మాట.. రైలు కూతలో కలిసిపోతున్న ఆత్మీయుల వీడ్కోలు పాట.. ​కళ్ళ ముందు నగరపు హోరు.. గుండె నిండా పల్లెటూరి జోరు.. రెక్కలు అలిసినా ఆగని పయనం.. బతుకు చక్రంలో ఇదొక నిత్య గమనం.. కాంక్రీటు అడవిలో కాలం గడపాలి.. యాంత్రిక జీవనంలో ఇన్నాళ్లు నలగాలి.. గూటికి చేరే ఆ ఒక్క పండుగ కోసం మళ్ళీ ఏడాది పొడవునా వేచి చూడాలి.. 17.01.2026

నిశ్శబ్ద జ్వాల | ఫణీంద్ర కుప్పిలి

  నిశ్శబ్ద జ్వాల | ఫణీంద్ర కుప్పిలి  నమ్మకాల చితిపై రగిలిన సంధ్యాజ్వాలల్లో నడక నేర్పిన నిశ్శబ్ద ధైర్యాలెన్నో.. ఆశల రేకులు రాలి అంతర్థానమైనా పునర్జన్మకై తపించే ప్రాణస్పందనలెన్నో.. గతపు గాయాల నీడలు శ్వాసను ముట్టడిస్తుంటే, జ్ఞాపకాల సుడులు వర్తమానాన్ని కబళిస్తుంటే.. భాషకు అందని వేదనల భారమంతా మౌనమనే మహాసముద్రంలో కరిగిపోతోంది.. పంచుకోలేని వ్యథలు శిలలై గడ్డకట్టి హృదయ ద్వారాలను బంధించినా, అందని ఆదరణకై ఆత్మ చేసే అన్వేషణ నిశ్శబ్దంగా అంతరాత్మను శోధిస్తూనే ఉంటుంది.. పరాజయాల విషాన్ని అమృతంగా భావించి, చిరునవ్వునే ఓ కవచంగా ధరించిన యోధులెందరో.. నిశీధిని దాటే ఒక్క ఆశాకిరణం కోసం కాలాన్నే కంటిపాపగా మార్చుకున్న రాత్రులెన్నో.. 06.01.2026