సముద్రం | ఫణీంద్ర కుప్పిలి
సముద్రం | ఫణీంద్ర కుప్పిలి
పడి లేస్తూ.. లేచి పడుతూ..
తీరాన్ని తాకాలన్న ఏకైక తపనతో
అలుపెరుగని కాల గమనంలా,
ఫలాపేక్ష లేని నిష్కామ యోగిలా..
నిరంతరం, నిర్విరామంగా
తనను తాను పునర్నిర్మించుకుంటూనే ఉంటుంది..
మనిషీ
కాలం విసిరే గాయాల రాళ్ళను
అనుభవాల ముత్యాలుగా మార్చుకుంటూ..
అవమానాల సుడిగుండాల నుండి
ఆత్మగౌరవ తీరానికి చేరాలని నిత్యం తపిస్తాడు..
ఎందరో వదిలివెళ్ళిన స్మృతుల శిథిలాలను
హృదయ గర్భంలో నిశ్శబ్దంగా దాచుకుని,
ఉపరితలంపై మాత్రం
అనంత ప్రశాంతతను నటిస్తాడు.
ఎన్ని తుఫానులు విరుచుకుపడ్డా,
ఎన్ని తీరాలు దూరమై వెక్కిరించినా..
అతడు ఆగడు, ఆగలేడు..
సముద్రానికి తరంగమేదో.. మనిషికి చైతన్యమది..
ప్రయాణమే తన స్వభావమని,
పోరాటమే తన ఉనికికి పరమార్థమని..
సముద్రపు లోతుల్లో దాగున్న మౌనానికి తెలిసినట్టే,
మనిషి ఆత్మకూ తెలుసు..
28.05.2026