చీకటి తర్వాత…| ఫణీంద్ర కుప్పిలి
చీకటి తర్వాత…| ఫణీంద్ర కుప్పిలి
చీకటి తర్వాత వెలుగు వస్తుంది..
కానీ వేకువ భారాన్ని మోయలేని
కొన్ని భుజాలు రాత్రిలోనే విరిగిపోతాయి.
ఓటమి విజయానికి తొలి మెట్టు అంటారు..
కానీ కన్నీటి మట్టిలో నడిచేవాడికి
ప్రతి అడుగూ ఒక అగాధమే..
ఆదర్శాలు ఎండమావులై పిలుస్తాయి..
పరుగెత్తి చేరేసరికి ఖాళీ చూపులే మిగులుతాయి..
ఆశ అనే సన్నని దారాన్ని పట్టుకుని
నిరాశ అగాధంలో మనిషి వేలాడుతూనే ఉంటాడు..
దారమూ తెగదు..నేలకూ తగలదు..
జనన మరణాల ఈ కాలచక్రం
విముక్తి కోసం కాదు..
తిరగడం మాత్రమే తెలిసిన
గుడ్డి గుర్రంలా సాగుతుంది..
అవును, వెలుగు వస్తుంది..
కానీ అది ఆరిపోయిన దీపాన్ని వెలిగించదు..
కాలిపోయిన సత్యాలను చూపే
నిలువుటద్దమై మిగులుతుంది..
19.05.2026