Posts

Showing posts from July, 2025

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి

 డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి ఆస్తులు.. అంతస్తులు.. బంధాలు.. బాంధవ్యాలు.. భయాలు.. భావోద్వేగాలు.. రాగ భావ ద్వేషాలు.. భవ బంధాల్ని తెంచుకుని.. అన్నింటికీ అతీతంగా.. నిజమైన విరాగిలా.. శ్మశానం అంచున ప్రాణంతో పడున్న శవంలా.. నిస్తేజంగా, నిర్లిప్తం గా అనంత శూన్యం లోకి చూస్తూ.. వ్యక్తపరచని భావాలు.. మరిచిపోయిన క్షణాలు.. చేయాలనుకున్న పనులు.. ప్రేమించాల్సిన మనసులు.. నిన్ను వెంటాడుతూ.. వేధిస్తాయి.. చివరికి ఆరోజు రానే వస్తుంది.. ఇహ లోక పాత్రకి స్వస్తి పలికి.. పరలోక యాత్రకు పయణమవుతావు.. ఆకాశం విరిగిపడదు.. భూమి బ్రద్దలవదు.. సాగర కెరటాలు ఆగిపోవు.. తారలు నేలకొరగవు.. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది.. మనిషి పరుగులుతీస్తూనే ఉంటాడు.. చాలామంది నిన్ను మర్చిపోతారు.. అతి కొద్దిమంది నిన్ను తలుస్తారు..  అమితంగా ప్రేమించేవారు నిన్ను కొలుస్తారు.. నీవు రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టినదంతా పరులపాలవుతుంది.. నీవు చేసిన మంచి చెడులే మిగుల్తాయి.. నిన్ను సమాజంలో మనిషిగా నిలబెడతాయి.. 19.07.2021

విరిగిన ఆలోచనల వెలుగు | ఫణీంద్ర కుప్పిలి

విరిగిన ఆలోచనల వెలుగు | ఫణీంద్ర కుప్పిలి పరస్పర విరుద్ధమైన ఆలోచనలు.. అలవికాని ఆకాంక్షలతో.. రోజు రోజుకూ మరింతగా తనలో తాను కుంచించుకు పోతూ.. అను నిత్యం తీవ్రమైన అలజడికి గురైన మానవ ఆలోచనల పుట్ట.. ఒక్కసారిగా బద్దలై.. లెక్కలేనన్ని ఆలోచనలు తునాతునకలై చెల్లాచెదురుగా విసిరివేయబడ్డాయి.. ఇక అక్కడ భరించలేని ఏకాకితనం.. భయపెట్టే నిశ్శబ్దం ఆవహించింది.. నేను నెమ్మదిగా తేరుకుని.. చెల్లాచెదురుగా ఉన్న ఆలోచనల ముక్కలను.. మరలా అతికించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను.. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఏ రెండు ఆలోచనల ముక్కలు పొసగటం లేదు.. విసిగి వేసారి చివరకు నిస్తేజంగా కూలబడ్డాను.. నాలో ఎటువంటి అలజడి లేదు.. నా మస్తిష్కం లో ఎలాంటి ఆలోచనలు మిగల్లేదు.. ఆ విరిగిన ఆలోచన ముక్కలనే తదేకంగా చూస్తూ నా మనో నేత్రాల్ని మూసుకున్నాను.. ఇపుడు మనసుకి ఎంతో హాయిగా ఉంది.. అంతలో నా కళ్ళముందు ఏదో వెలుగు ప్రసరించిన వైనం.. కళ్ళు తెరిచే చూసే సరికి.. అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.. నేను ఎన్నో ఏళ్లుగా తీవ్రంగా శ్రమించినా కానరాని ఫలితం.. విరిగి పడిన రకరకాల ఆలోచనల ముక్కలు మెల్లగా ఒక రూపాన్ని సంతరించుకుంటున్నాయి.. 28.07.2025