Posts

తాజా పోస్ట్

వరమై రావాల్సిన వాన… శాపమై | ఫణీంద్ర కుప్పిలి

  వరమై రావాల్సిన వాన… శాపమై | ఫణీంద్ర కుప్పిలి కరుణించని వరుణ దేవుడు అడక్కుండానే విరుచుకుపడి కళ్ల ముందే కలలను కొట్టుకుపోతుంటే నిస్సహాయంగా నిలబెట్టే ప్రళయం ఇది.. నిన్నటి వరకు చినుకు కోసం ఎదురుచూసిన నేల, నేడు కన్నీటి సంద్రం.. చెమట చుక్కలతో పంట పండించిన రైతు గుండె, నేడు ఊపిరాడని వరద.. మేఘాల రాక కోసం పరితపించిన మనసులు, నేడు ఆ గర్జనకే వణికిపోతున్నాయి.. 28.10.2026

వర్షం-4 | ఫణీంద్ర కుప్పిలి

వర్షం-4 | ఫణీంద్ర కుప్పిలి  మట్టి ఒక ముసలి ముఖం కన్నీటి ముడతల చరిత్ర.. ఆశ ఒక్కటే చిగురు ఎండలో కాలిన దీపశిఖ.. చెరువు ఖాళీ కంటిగుడ్డు బావి లోతున వినిపించేది ఒక వృద్ధ రోదన మాత్రమే.. విత్తనం పసిపాప శవం మట్టి గర్భంలో గడ్డకట్టింది. కల అనే ప్రమిద ఆరిపోయింది గుండె అనే గుడిలో.. అప్పు ఒక చీకటి నది అంకెలే దాని అలలు.. పిల్లల ప్రశ్నలు రెక్కలు తెగిన పక్షులు, గాలిలో రాలిపోతున్నాయి.. పొలం తెరచిన సమాధి, ఆశలే అందులో శవాలు. మేఘం అబద్ధపు వాగ్దానం, గాలికి చిరిగిన కాగితం.. ఆకలి నిశ్శబ్ద నీడ నేల మీద శోకవస్త్రం.. మిగిలింది బూడిద భూమి చనిపోయిన దేవుడి ఖాళీ సింహాసనం.. 07.09.2026
వైభవాన్ని చూసి చేరేది సమూహం..                    గాయాన్ని తడిమి ఓదార్చేది స్నేహం. మారే కాలంలో అనేక ముఖాలు దాటిపోతాయి.. జీవితం చివరికి ఒకే సత్యాన్ని మిగులుస్తుంది.. సంతోషంలో కలిసి నవ్వే ముఖాల కన్నా సంక్షోభంలో పక్కన నిలిచే గుండెలే మిన్న.. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..
చీకటి వెలుగును చూసి ఫక్కున నవ్వింది... కనిపించేదంతా నిజం కాదు... మెరిసేదంతా బంగారం కాదు అని.. వెలుగు ప్రశాంతంగా బదులిచ్చింది.. కనిపించనిదంతా మాయ కాదు.. నిజం కనిపించాల్సిన అవసరమే లేదు అని.. -ఫణీంద్ర కుప్పిలి 18.07.2026

వర్షం-3 | ఫణింద్ర కుప్పిలి

  వ ర్షం-3 | ఫణింద్ర కుప్పిలి ఈసారి ఆకాశం మొఖం చాటేసింది దిక్కులేని రైతుపై పగబట్టి అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు మబ్బు ముసుగేసుకుంది మొండిగా.. "అలక మాని కురవవా..." అని కళ్లలో ఆశలు ఇంకిపోతుంటే అర్థిస్తున్నాడు రైతు.. దూరాన మెరుపు మెరిస్తే గుండె చిగురిస్తుంది దగ్గరయ్యేలోగా గాలి మాట విని మబ్బు వేరే దారి పడుతుంది.. నేలతల్లి పెదవులు దాహంతో పగుళ్లు బారగా పొలం గుండె ఒక్క స్పర్శ కోసం మౌనంగా తపిస్తోంది. ఆకాశం మాత్రం చినుకుకు బదులు నిర్దయగా తన ప్రకోపాన్ని చూపిస్తోంది.. విత్తనం నేల ఒడిలో జీవచ్ఛవంలా నిద్రిస్తూ చినుకు పిలుపు కోసం ఎదురుచూస్తుంటే.. రైతు గుండె అనునిత్యం ఆశ-నిరాశల నడుమ ఊపిరాడక కొట్టుకుంటోంది.. 28.07.2026

వర్షం -2 | ఫణీంద్ర కుప్పిలి

  వర్షం -2 | ఫణీంద్ర కుప్పిలి వర్షం నెమ్మదిగా చిన్న తుంపర్లుగా మొదలైంది.. అత్తవారింటిలో అడుగుపెట్టిన కొత్త పెళ్ళికూతురిలా.. అప్పటి వరకు చుక్క నీటికోసం అలమటించి నెర్రెలు బారిన నేల తల్లి మెల్లగా గుటకలు వేస్తోంది.. వర్షపు జల్లుతో పులకరించిన నేల కమ్మని మట్టి వాసన వెదజల్లుతోంది.. బామ్మ చేసిన చిక్కని ఫిల్టర్ కాఫీ కమ్మదనంలా మనసుని పరవశింపజేస్తోంది.. అంతలోనే... చిరు గాలికి చెట్ల కొమ్మలు ఊగాయి తల్లి ఒడిలో నిద్రపోతున్న బిడ్డను జోలపాడి ఓదార్చినట్లుగా... ఆకుల చివర వేలాడే నీటి బిందువులు కన్నీటి ముత్యాల్లా మెరిసాయి వేదనను వెలుగుగా మలచే ప్రకృతి తత్వాన్ని నేర్పాయి...  05.07.2026

వర్షం | ఫణీంద్ర కుప్పిలి

వర్షం | ఫణీంద్ర కుప్పిలి  వర్షం నెమ్మదిగా మొదలైంది.. చిన్న తుంపర్లుగా పడుతోంది.. గుండెలోని బాధ తన్నుకొస్తుంటే జాలువారే కన్నీళ్ళు లాగా.. శ్రమజీవి చెమట చుక్కలు ఆవిరై తిరిగి అవని మీద కురుస్తున్నట్లుగా.. వర్షం జోరు అందుకుంది మనం పుడమి తల్లిపై చేస్తున్న అకృత్యాలను  చూసి గుండెలవిసేలా ఏడుస్తున్నట్టు భోరుమని వర్షం కురుస్తోంది.. మధ్య మధ్యలో వెక్కిళ్లు పెడుతున్నట్లు ఉరుములతో ఉక్కిరిబిక్కిరవుతోంది.. గుండెలోని బాధ తీరిన తర్వాత  అలసి సొలసి సొమ్మగిల్లినట్లు మేఘం మూతి ముడుచుకుని కూర్చుంది.. అప్పటి వరకు గర్జించిన ఆకాశం విషాదం నుండి కోలుకున్న మనిషిలా ఇపుడు నిర్మలంగా ఆహ్లాదంగా కనిపిస్తోంది తనలోని భిన్న పార్శ్వాలను చూపిస్తూ హరివిల్లుతో కనువిందు చేస్తోంది.. 21.06.2026