వర్షం-3 | ఫణింద్ర కుప్పిలి

 ర్షం-3 | ఫణింద్ర కుప్పిలి

ఈసారి ఆకాశం మొఖం చాటేసింది
దిక్కులేని రైతుపై పగబట్టి
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు
మబ్బు ముసుగేసుకుంది మొండిగా..

"అలక మాని కురవవా..." అని
కళ్లలో ఆశలు ఇంకిపోతుంటే అర్థిస్తున్నాడు రైతు..
దూరాన మెరుపు మెరిస్తే గుండె చిగురిస్తుంది
దగ్గరయ్యేలోగా గాలి మాట విని
మబ్బు వేరే దారి పడుతుంది..

నేలతల్లి పెదవులు దాహంతో పగుళ్లు బారగా
పొలం గుండె ఒక్క స్పర్శ కోసం మౌనంగా తపిస్తోంది.
ఆకాశం మాత్రం చినుకుకు బదులు
నిర్దయగా తన ప్రకోపాన్ని చూపిస్తోంది..

విత్తనం నేల ఒడిలో జీవచ్ఛవంలా నిద్రిస్తూ
చినుకు పిలుపు కోసం ఎదురుచూస్తుంటే..
రైతు గుండె అనునిత్యం ఆశ-నిరాశల నడుమ
ఊపిరాడక కొట్టుకుంటోంది..
28.07.2026

పాప్యులర్ పోస్టు

మా హరీష్ గాడి పెళ్లిలో టీ గోల

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి