ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

గతంలో నేను టీచర్ గా పనిచేస్తున్న రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలొచ్చాయి.. ఈ ఎన్నికల డ్యూటీలు అనేవి కొందరికి మహా సరదా అయితే నాలాంటి మరికొందరికి కొంచెం బాధతో కూడుకున్నవి.. దానికి కారణం సాధారణంగా అప్పట్లో ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించే అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఉండేవి కాదు..దాంతో పాటు పట్టణాలలో అయితే భోజనానికి పెద్దగా ఇబ్బంది ఉండదు.. కానీ అదే పల్లెటూళ్లో అయితే చాలా ఇబ్బంది.. ఇంకా మన సహచరుల సహాయంలేకపోతే పెనంమీద నుండి పొయ్యిలో పడ్డట్టే.. మనకు గతంలో ఇలాంటి స్వీ(హా)టు మెమోరీస్ చాలానే ఉన్నాయి😥

ఇక ఎన్నికల రోజు రానే వచ్చింది.. ఉదయాన్నే బయలుదేరి ఎన్నికల సామగ్రి అందించే ఆఫీసు వద్దకు చేరుకున్నాను..నేను కుంచెం సీనియర్ ని అయినందువల్ల.. నాకు ప్రిసైడింగ్ 'అధికారి' ( పేరు పెద్ద..ఊరు దిబ్బ లాగా..ఈ పదవులన్నీ తేడాలు రానంతవరకే 🤣)గా వేశారు.. భగవంతుడా..ఈసారైనా నాకు మంచోళ్ళు దొరికేలా చూడు స్వామి  అని అనుకుంటుండగా..'...ఒరేయ్ మామా.. ఇంతసేపు ఎక్కడున్నావ్ రా..' అనే (గావు)కేక విన్పించింది.. బాగా విన్న గొంతులా ఉందే అని వెనక్కి తిరిగి చూసేసరికి.. ఇంకేముంది.. నా చిరకాల ప్రాణం(తీసే) మిత్రుడు 😀 మా ఈశ్వరరావు అలియాస్ ఈసు గాడు.. అమాంతంగా మీదకి దూకాడు.. అది ఆడి స్టయిల్లో విష్ చేయడం అన్నమాట.. అంతే..నా గుండె గతుక్కుమంది.. ఎందుకంటే మావాడు చాలా మంచోడు..మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నోడు అయినప్పటికీ.. కుదురుగా కూచుని పనిచేసే రకం కాదు.. ఆ టైంలో మనకు కామెడీల కన్నా.. కథ నడిపించెటోడే కావాలి.. ఎందుకంటే..అవి అసలే పంచాయతీ ఎలక్షన్స్.. ఏదన్నా తేడా వస్తే అక్కడే మనల్ని కైమా కొట్టేస్తారు😤

నాకప్పుడే అర్థమయిపోయింది..ఈసారి కూడా మనకు దబిడి డిబిడే😀 అని.. అదృష్టవశాత్తూ మరో పోలింగ్ అధికారిగా ఒక కొత్తగా ఉద్యోగం లో చేరిన కుర్రాడ్ని వేశారు.. మనోడు చాలా ఉత్సాహంగా దూసుకుపోతున్నాడు.. దాంతో నేను కాస్తా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఆ డబ్బాలు.. సంచులూ అన్నీ మోసుకొని ఎలాగోలా ఓ డొక్కు బస్సులో మాకు ఎలాట్ చేసిన ఊరికి చేరుకున్నాం.. నేను వెళ్తానే ఆ స్కూల్ లో ఓ మూల చూసుకుని.. సంతలో గాజులు అమ్మినోడిలా.. ఒక్కక్క మూట జాగ్రత్తగా విప్పి.. కలిసిపోకుండా పేర్చుతున్నాను.. మా కుర్ర మాస్టారు మాత్రం.. క్రీస్తు పూర్వం నాటి ఆ బ్యాలెట్ డబ్బాల వంక.. అదేదో మ్యూజియం లో..కళాఖండాన్ని చూస్తున్నట్లు.. ఆరాధనా భావంతో కన్నార్పకుండా చూస్తున్నాడు🤔.

నిజానికి దాన్ని ఓపెన్ చేయడం అనేది ఓ పెద్ద ఆర్ట్ కం సైన్సు.. చాలా పద్ధతిగా.. నిదానంగా.. మొక్కకి అంటు కట్టినట్లు.. ఏదో సర్జరీ చేస్తున్నట్లు.. శ్రద్ధగా.. ఓపికగా చేయాలి😂😂.. కొంచెం ఆవేశ పడ్డామంటే.. ఇక అంతే.. కనీసం ఓ రెండు మూడు టీ.టీ ఇంజెక్షన్లయిన పొడిపించుకోవాలి😁..నాకు మనోడి దూకుడు అర్థమయి.. ఉన్న ఒక్క హ్యాండు లేకుండా పోతుందననే భయంతో..ఠక్కున చేయిపట్టుకు లాగేసా😅.. ఇలా మా బాధల్లో మేముంటే.. మా ఈసుగాడు మాత్రం ఒరిజినల్ గెటప్ లోకి వచ్చేసాడు.. ఓ గళ్ళ లుంగీ వేసుకుని.. మెడలో తువ్వాలతో రెఢీ అయిపోయాడు.. నేను '.ఎక్కడికిరా?..' అని అడిగే లోపే..'మావా.. నేను అలాగ ఓసారి ఊళ్ళోకి తిరిగొస్తాను..' అని చెప్పి.. ఆడు బయటికి చెక్కేశాడు.. నాకు మనోడు గురించి బాగా తెలుసు కాబట్టి.. అన్నీ మూసుకుని పని మొదలెట్టాను..

ఈ ఎలక్షన్ వర్క్ అనేది చాలా వరకు ఫార్మల్ గా ఉంటుంది.. పనున్నా..లేకపోయినా.. ఇచ్చిన ప్రతీ ప్రొఫార్మాని.. ఖాళీదైనా సరే.. ఓ కవర్లో పెట్టి..పైన అన్ని వివరాలు రాసి.. లక్కతో సీల్ వేయాలి.. దాంతో నేను కొన్ని పనులు మావాడికి అప్పగించి.. నేను సీలు వేసే పని చేస్తున్నాను..ఎందుకంటే అదో పెద్ద ప్రహసనం.. ఇంకా ఎలక్షన్ వర్క్ కోసం ఇచ్చే మెటీరియల్ గురించి చెప్పాలంటే..అది మరో '..మొగలి రేకులు' సీరియల్ అంత అవుతుంది😆..

అదేంటో గానీ..అదేదో వెంకటేశ్ సినిమాలో లాగా.. వాళ్లిచ్చేవన్నీ..కొవ్వొత్తి లాంటిది..సీల్ లాంటిది..అని చెప్పుకోవాలి..  కొవ్వొత్తులు వెలగవు.. లక్క అంటుకోదు.. సీలు పడదు.. అసలు వాళ్లకు ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయో🤔.. లేదంటే కేవలం ఎలక్షన్ల కోసమే ఇలాంటివి తయారు చేస్తారో😀.. మొత్తానికి ఎలాగోలా నానా బాధలు పడి.. పనిచేస్తున్నాం.. ఇంతలో సడెన్ గా మావాడు.. గాట్టిగా '..మావా... ' అని కేక వేయడంతో నేను తుళ్లి పడి.. కాల్చిన లక్కతో కవర్ పై వేయాల్సిన సీలును కాస్తా..  మా కుర్ర ఆఫీసరు కాలిపై వేసేసాను.. దాంతో మనోడు బిల్డింగ్ కూలిపోయేలా అరిచాడు🤧..

కాసేపు అక్కడంతా గందరగోళం గా మారిపోయింది..సడన్ గా అక్కడున్న ప్రతీ ఒక్కరూ.. ప్రకృతి వైద్యులైపోయారు🤣.. చేతికి దొరికిన దాన్ని.. అతని కాలిపై పూసేశారు..దాంతో నాకు బాగా కోపమొచ్చి.. ' ఇంతవరకూ.. ఎక్కడ గాలి తిరుగుళ్లు తిరుక్కుని వచ్చావురా..' అని మా ఈసు గాడిని.. చెడా మడా తిట్టేసా..(మనోడికి నా వల్లే కాలిపోయిందనే విషయాన్ని కవర్ చేయడం కోసం😬).. 'అయినా ఏదో మనకు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ వచ్చినట్లు ఎందుకురా ఆ గెంతులు?ఏంటి మోసుకొచ్చావ్ అని అడిగా..' దానికి మావాడు.. మాంచి హుషారుగా..' ..ఒరేయ్ మావా.. అలాగా ఊర్లోకి తిరగడానికి ఎల్లి.. రాత్రికి భోజానాలు ఎవలెడతారనే దాన్ని కూపీ లాగానురా.. ' అని ఏదో చెప్పబోతుండగా.. 'అయితే ఏంటిరా? నీకెపుడూ ఈ తిండి గోలే..'అని విసుక్కున్నా.. అయినా మనోడు తగ్గకుండా..' ఒరేయ్ మావా.. నువ్వెప్పుడు అలాగే అంటావ్ గానీ.. ఆళ్ళింటి ముందు..'అని నసిగాడు.. 'ఒరేయ్ బాబూ.. ఆళ్ళింటి ముందు ఏటుందిరా? నాయనా..' నన్ను చావగొట్టకు..పనుంది'  అని  తలా పైకెత్తకుండానే అన్నా.. అయినా మనోడు ఉత్సాహాన్ని ఆపుకోలేక..'..ఒరేయ్ మావా.. ఓ పెద్ద గొర్రిపోతు🐏 కట్టేసుందరా.. రాత్రికి మటన్ కూర అనుకుంటా.. ఫుల్లుగా దుల్లగొట్టేయాలి..' అని చెప్పుకుంటు పోతున్నాడు... నేను మాత్రం '..ఖర్మరా బాబూ.. రేపేదన్నా తేడా వస్తే.. మనల్ని ఏసేసి... ఊరు ఆవిత పెట్టేస్తారు..'అని అనుకుంటు నాపనిలో మునిగిపోయా🙄..

మావాడు ఫ్రెష్ అయి వస్తానని మల్లీ ఎటో  జంప్ అయిపోయాడు.. సర్లే..ఆడుంటేనే బేజారు అని పట్టించుకోలేదు.. సుమారు రాత్రి ఏడవుతోంది.. అప్పటికి ఇంచుమించుగా పని పూర్తికావస్తోంది.. అంతే కాకుండా మధ్యాహ్నం నుండి కంటిన్యూగా ఈ అంటింపుల కార్యక్రమం చేయడం వలన.. మాకు కొంచెం చిరాకుగా ఉండటంతో.. లేచి కొంచెం రిలాక్స్ అయ్యాము.. ఈలోగా మనోడు ' ఫుల్'😁ఫ్రెష్ అయి.. మాంచి మాస్ మసాలా సాంగ్ ని ఈల వేసుకుంటూ వస్తున్నాడు.. నన్ను చూసి 'పద మావా.. భోజనాలకి ఎల్దాము.. లక్కీగా ఈరోజు.. తినే రోజు పడింది.. ఎల్లి మటన్ కూరతో ఓ పట్టు పడదాం.. ' అని గాభరా పెట్టసాగాడు.. ఇక తప్పేది లేక బయలుదేరాం.. తినే రోజు అయినా సాధారణంగా నేను బయట నాన్ వెజ్ ప్రిఫర్ చేయను.. నాకు ఆ మసాలాలు అవీ పడవు.. మరీ ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో.. ఎందుకంటే ఉదయాన్నే అసలు ఘట్టం ప్రారంభమవుతుంది.. పొరపాటున మనకు ఏదన్నా తేడా వచ్చి.. సీలు కొట్టేసిందో🤣🤣 ఇక అంతే.. మొత్తం రసాభాస అయిపోతుంది😂..

మొత్తానికి ఆ చీకట్లోనే కొంచెం దూరం నడిచి ఒకింటికి చేరుకున్నాం.. అక్కడ ఓ  500 క్యాండీల్స్ బల్బు పెట్టారు.. ఓ పెద్దాయన కొంచెం సన్నగా పొడుగ్గా మాంచి సిల్కు లాల్చీ లో మెరిసిపోతున్నాడు.. తన కొరమీసాన్ని మధ్యమధ్యలో తిప్పుతూ.. అందరికి  ఆర్దర్లు పాస్ చేస్తున్నాడు.. అక్కడ కొంతమంది హడావుడిగా ఓ వరండాలో గచ్చుపై రెండు వరుసల్లో విస్తరాకులు వేస్తున్నారు.. ఆ పెద్దాయన.. తన మీసం దువ్వుకుంటు.. '..మేష్టగోర్లు.. వెజ్జోళ్ళు ఒకవైపు..నాన్ వెజ్జోళ్ళు మరోవైపు కూర్సొండి.. రెండూ ఉన్నాయి..'అని.. గవర్నమెంట్ బడిలో.. ఇంగ్లీష్ మీడియం సెక్షన్ కోసం.. ఏబీసీడీలు వొచ్చినోలు ఒకవైపు.. రానోళ్ళు మరోవైపు కూర్చోమని మేష్టారు ఆర్డర్ ఏసినట్లు ఏశాడు😲😲..

నేను ఎందుకైనా మంచిదని..ఆ వెజ్జోళ్ళు వైపుకి వెళ్తుంటే.. మావాడు ఒక్క ఉదుటున లాగి ఆది పక్కన కూలదోశాడు..సర్లే ఏదొకటి తిని తగలడదాం అని డిసైడ్ అయ్యాను.. మా ఈసు గాడికి..తిండి అనేది కాదు గానీ.. ఇలాంటి వంటే అదో సరదా.. వడ్డన మొదలైంది.. అదేంటో విచిత్రంగా ముందు అన్నం వడ్డించారు.. ఆ తర్వాత 'వంకాయ' కూర వడ్డిస్తున్నారు.. నేను అది చూసి కిసుక్కన నవ్వా.. మా వాడికి మండి.. 'ఒరేయ్ మావా.. అది వేజ్జోళ్ళకి వండింది అనుకుంటా.. టేస్టు కోసం కొంచెం మనకూ వేస్తున్నట్లున్నారు.. నువ్ కొంచెం ఆగు.. మటన్ వస్తాది.. అని ఆ వడ్డించే వాళ్ళవైపు చూస్తున్నాడు ఆత్రంగా..' ఇంకేదో పచ్చడి, చారు వేశారు.. నేను ఆ వంకాయతోనే మొదలెట్టాను.. అందరూ కూడా కాస్తా అయోమయానికి గురై.. బయటకి అనలేక.. తినటం స్టార్ట్ చేశారు.. అయినా మా ఈసు గాడు మాత్రం.. మొదటి ముద్ద కూడా మటన్ కర్రీ తోనే మొదలెట్టాలని భీష్మించుకుని కూర్చున్నాడు..

మావాడి వాలకం చూసి.. ఆ లాల్చీ పెద్దాయన..' ఏటండీ మేష్టగోరు.. ముద్ద కలపకుండా.. ఇంకా అటు ఇటూ సూస్తన్నారు?..' అని.. తానేదో 'నమస్తే ట్రంప్' కార్యక్రమాన్ని ఘనంగా చేసినట్లు మురిసిపోతున్నాడు.. మావాడికి బాగా ఒళ్ళు మండిపోయి..' పెద్ద..నాన్ వెజ్జోళ్ళు ఇటేపు కూర్చోండి అని బిల్డప్ ఇచ్చి.. సివరికి వంకాయ కూరతో సరిపెడతారా??..'😤😤 అని గట్టిగానే ఆడిగేసాడు.. దానికి మాలైన్లో కూర్చున్నోళ్లు చాలా మంది వంత పాడారు.. దానికి ఆ లాల్చీవోడు కాస్తా  అసహనంగా.. '..మీరు గొప్పోలేనండి మేష్టగోరు.. నేను దగ్గిరుండి.. ఇంత కట్టబడి మీకు నాన్ వెజ్జి వండిస్తే..ఇలాగ నిష్ఠురాలేస్తారేటి బాబూ..' అని అన్నాడు.. మావాడికి బుర్ర గిర్రున తిరిగిపోయింది..


ఈలోగా మాలైన్లో కూర్చున్న ఓ కుర్ర మేష్టారు.. గాట్టిగా.. ఏదో ఆర్కేమెడీస్ 'యురేకా..'అని అరిచినట్లు.. ' ఇదిగో నాకు దొరికిందీ..' అంటూ చేత్తో ఏదో పైకెత్తి చూపిస్తున్నాడు.. ఒక్కసారి అందరూ తుళ్ళుక్కు పడి అటువైపు చూసారు.. నాకు మాత్రం కొంపదీసి ఈ చీకట్లో ఏ బల్లయినా పడిపోయిందా? ఏంట్రా భగవంతుడా..అని హడలి చచ్చేను.. ఇంతకీ అదేంటంటే.. అదొక చిన్న '..ఎండి రెయ్యి ముక్క'🍤.. ఈలోగా ఆ లాల్చీవోడు.. మా ఈసు గాడి వైపు చూస్తూ..' మేష్టగోరు.. మీరు నా మీద ఎగిరిపోనారు గానీ.. సూసినారా నాను మీకోసం..దగ్గిరుండి వంకాయి..ఎండు రెయ్యిలు గొంటా కూర వండించినాను కదేటి..'😲😲.. 'మీరు కూడా కొంచెం కెలికి సూడండి బాబూ.. మీకూ ఒకటో రెండో తేలతాయి..'అంటూ చిద్విలాసంగా నవ్వుతూ అంటున్నాడు.. 

నాకు మాత్రం నవ్వు ఆగలేదు.. పడీ పడీ నవ్వాను.. సాయంత్రం నుండి మావాడి హడావుడి చూసిన మిగతా వాళ్లు కూడా ఘొల్లుమన్నారు.. దాంతో మా ఈసు గాడి పరిస్థితి.. '..ఐదేళ్ల ముందు నుండీ.. టికెట్ నాకే వస్తుందని తెగ హడావుడి చేసి.. చివరికి ఎలక్షన్ల టైంలో..టిక్కెట్ కోసం ఎగేసుకుని ఎయిర్ బస్సులో పార్టీ అధిష్టానం ముందువాలితే.. ఒట్టి మొండి చెయ్యి చూపిస్తే బాగోదని.. చేతిలో ఎర్ర బస్సు రిటర్న్ టికెట్ పెట్టి పంపించినట్లయింది😁🤣..

10 మార్చి, 2020.

P.S:  Just for fun😀

పాప్యులర్ పోస్టు

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం