Posts

Showing posts from September, 2026

వర్షం-4 | ఫణీంద్ర కుప్పిలి

వర్షం-4 | ఫణీంద్ర కుప్పిలి  మట్టి ఒక ముసలి ముఖం కన్నీటి ముడతల చరిత్ర.. ఆశ ఒక్కటే చిగురు ఎండలో కాలిన దీపశిఖ.. చెరువు ఖాళీ కంటిగుడ్డు బావి లోతున వినిపించేది ఒక వృద్ధ రోదన మాత్రమే.. విత్తనం పసిపాప శవం మట్టి గర్భంలో గడ్డకట్టింది. కల అనే ప్రమిద ఆరిపోయింది గుండె అనే గుడిలో.. అప్పు ఒక చీకటి నది అంకెలే దాని అలలు.. పిల్లల ప్రశ్నలు రెక్కలు తెగిన పక్షులు, గాలిలో రాలిపోతున్నాయి.. పొలం తెరచిన సమాధి, ఆశలే అందులో శవాలు. మేఘం అబద్ధపు వాగ్దానం, గాలికి చిరిగిన కాగితం.. ఆకలి నిశ్శబ్ద నీడ నేల మీద శోకవస్త్రం.. మిగిలింది బూడిద భూమి చనిపోయిన దేవుడి ఖాళీ సింహాసనం.. 07.09.2026