విరిగిన ఆలోచనల వెలుగు | ఫణీంద్ర కుప్పిలి

విరిగిన ఆలోచనల వెలుగు | ఫణీంద్ర కుప్పిలి

పరస్పర విరుద్ధమైన ఆలోచనలు..

అలవికాని ఆకాంక్షలతో..

రోజు రోజుకూ మరింతగా

తనలో తాను కుంచించుకు పోతూ..

అను నిత్యం తీవ్రమైన అలజడికి గురైన

మానవ ఆలోచనల పుట్ట..

ఒక్కసారిగా బద్దలై..

లెక్కలేనన్ని ఆలోచనలు తునాతునకలై

చెల్లాచెదురుగా విసిరివేయబడ్డాయి..

ఇక అక్కడ భరించలేని ఏకాకితనం..

భయపెట్టే నిశ్శబ్దం ఆవహించింది..

నేను నెమ్మదిగా తేరుకుని..

చెల్లాచెదురుగా ఉన్న ఆలోచనల ముక్కలను..

మరలా అతికించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను..

ఎన్ని రకాలుగా ప్రయత్నించినా

ఏ రెండు ఆలోచనల ముక్కలు పొసగటం లేదు..

విసిగి వేసారి చివరకు నిస్తేజంగా కూలబడ్డాను..

నాలో ఎటువంటి అలజడి లేదు..

నా మస్తిష్కం లో ఎలాంటి ఆలోచనలు మిగల్లేదు..

ఆ విరిగిన ఆలోచన ముక్కలనే తదేకంగా చూస్తూ

నా మనో నేత్రాల్ని మూసుకున్నాను..

ఇపుడు మనసుకి ఎంతో హాయిగా ఉంది..

అంతలో నా కళ్ళముందు

ఏదో వెలుగు ప్రసరించిన వైనం..

కళ్ళు తెరిచే చూసే సరికి..

అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది..

నేను ఎన్నో ఏళ్లుగా తీవ్రంగా శ్రమించినా

కానరాని ఫలితం..

విరిగి పడిన రకరకాల ఆలోచనల ముక్కలు

మెల్లగా ఒక రూపాన్ని సంతరించుకుంటున్నాయి..

28.07.2025

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

మొబైలోపాఖ్యానం

(అ)పుత్రస్య గతిర్నాస్తి..