(అ)పుత్రస్య గతిర్నాస్తి..


"(అ)పుత్రస్య  గతిర్నాస్తి.‌.‌."| ఫణీంద్ర కుప్పిలి

అదో గవర్నమెంట్ ఆఫీసు.. అక్కడ ఆఫీసర్ సీట్లో ఒక కుర్రాడు ఠీవిగా కూర్చుని.. చాలా హుషారుగా తన పని చేసుకుంటున్నాడు.. ఇంతలో అటెండర్ వచ్చి.. సార్ మిమ్మల్ని కలవడానికి..మీ నాన్న గారు వచ్చారు..అని చెప్పాడు.. దాంతో అదోలా అతనివైపు చూసి లోనికి పంపించమన్నట్లు సైగ చేశాడు.. కాసేపటికి ఒక అతను..బాగా మాసిపోయిన బట్టల్లో లోపలికి వచ్చి ఎదురుగా నిల్చున్నాడు.. కనీసం కూర్చోమని కూడా అనకుండా '..ఇక్కడకు ఎందుకొచ్చావ్..' అని చిరాకుగా మొహం పెట్టి అడిగాడు..


             అతను అదేమీ పట్టించుకోకుండా..' ఫోన్ చేస్తే..లిఫ్ట్ చేయడం లేదు..'మాట పూర్తికాకుండానే..'నీలాగా నేనేమి పనీపాట లేకుండా..ఖాళీగా ఉన్నానా?..' అని ఇంకేదో అనబోతుంటే..'అలా అని కాదురా..నీకు ఇంతకుముందే చెప్పాను కదరా..ఇంటి మీద డబ్బు ఇచ్చిన వాడు..ఇప్పటికే నీ కొడుక్కి ఉద్యోగ వచ్చి చాలా ఏళ్ళయింది..పెళ్లి కూడా చేశావ్.. ఇంకెప్పుడు నా అప్పు తీరుస్తావ్? లేదంటే బాకీ కింద ఇల్లు అమ్మేయ్..'అని రోజూ ఇంటికొచ్చి గొడవ చేస్తున్నాడురా.. నువ్వు తల్చుకుంటే..ఆ బాకీ తీర్చడం పెద్ద విషయం కాదు..ఊళ్ళో ఇల్లు కూడా లేకపోతే ఎక్కడ ఉండేది రా..' అని ప్రాధేయపడుతూ కళ్ళ వెంట నీళ్లు తిప్పుకున్నాడు.. దానికి చిన్న కొడుకు కసురుకుంటూ.. 'నువ్వు ఉన్నదంతా తగలేసి.. ఊరంతా అప్పులు చేశావ్.. నేనెమన్నా నిన్ను అప్పులు చేసి చదివించమన్నానా?..నాకేం సంబంధం లేదు..వెళ్లి అన్నయ్యకి తీర్చమను..' అంటూ కసురుకున్నాడు..దాంతో దిగాలుగా తలా వేలాడదీసుకుని బయటికి నడిచాడు..


                        *        *        *

                     అది మంచి వేసవి కాలం.. పగలంతా తన ప్రతాపాన్ని చూపిన సూరీడు పడమర కొండల్లోకి మెల్లగా జారుకుంటున్నాడు.. దాంతో చెరువులో పని చేసుకుంటున్న వాళ్ళు తమ పనుల్ని ముగించుకుని ఇంటికి బయలుదేరి వెళ్లే హడావుడి లో ఉన్నారు.. ఆ చెరువుని ఆనుకుని ఉన్న పొలాల మధ్యలో ఓ పెద్ద వ్యవసాయ బావి ఉంది.. పని ముగిశాక అక్కడికి వెళ్లి.. కాళ్ళు చేతులు కడుక్కుని ఇంటికి బయలుదేరటం వాళ్ళకి అలవాటు.. అలాగే ఆరోజు కూడా కొంచెం త్వరగా పని ముగించుకున్నవాళ్ళు అటువైపు సాగుతున్నారు..

     ఇంతలో 'దబ్ 'మని నూతిలో ఎవరోపడిన శబ్దం.. ఆ పనులకు వచ్చే వాళ్లలో కొంచెం వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఉండటంతో..  పొరపాటున ఎవరైనా జారి పడ్డారేమో అని.. అందరూ పరుగు పరుగున నూతి దగ్గరికి చేరుకున్నారు.. నూతిలోకి వెంటనే ఓ ఇద్దరు కుర్రాళ్ళు దూకి.. మునిగిపోతున్న ఆ మనిషిని పట్టుకుని పైకి లాగారు.. నీరు కొంచెం లోపలికి ఉండటంతో.. వాళ్ళ దగ్గర ఉన్న ఓ పెద్ద మోకుని వేసి పైకి లాగారు.. పైకి లాగిన ఆ మనిషిని చూసి అక్కడున్న వాళ్ళు షాక్ కి గురయ్యారు..

         ఆ మనిషి బాగా నీళ్లు తాగేయడంతో.. ఈలోగా కొంతమంది అతని కడుపై నొక్కి బయటకి నీళ్లు లాగే ప్రయత్నం చేస్తున్నారు.. మరికొంతమంది మరికొన్ని సపర్యలు చేస్తున్నారు..ఆ మనిషి అక్కడున్న వాళ్లందరికీ బాగా తెలిసిన వ్యక్తి.. వాళ్ళ ఊరు ఆయనే కావడంతో.. అక్కడున్న వాళ్లంతా రకరకాలు మాట్లాడుకుంటున్నారు.. 'పాపం బాగా సదువుకున్నోడు.. బాగా బతికినోడు.. శివరికి ఇలాగ అయిపోనాడు.. ఎంత కట్టం వచ్చిందో ఈ బాబుకి..' అని ఒక ముసలామే అంటుంటే.. ఇంకో ఆమె..' పాపం ఈ బాబుకి ఇద్దరూ కొడుకులే.. ఒక ఆడ నలుసన్నా లేదు..' అని జాలిగా మాట్లాడుతోంది.. మొత్తానికి అందరూ కలిసి అతన్ని ఎత్తి ఒక బండి మీద వేసుకుని ఇంటికి బయలుదేరారు..

     మెయిన్ వీధి చివరిలో ఒక చిన్న డాబా ఇల్లు.. ముందుకి చిన్న వరండా ఉంది..ఆ వరండాలో కూర్చుని ఉన్న ఆమెను చూస్తే.. బొత్తిగా అమాయకురాలిలా ఉంది.. అంతమంది అటువైపు వస్తుండటంతో.. 'మా ఆయనికి ఏటయింది.. ' అంటూ గాభరాగా ఏడుస్తూ అడిగింది.. ఆ వచ్చిన వాళ్లలో ఒక పెద్దాయన..' ఏటీ అవ్వలేదమ్మా.. కొంచెం సుస్తీ సేసినట్టుంది.. పొలం దగ్గర పడుంటే.. తీసుకొచ్చినాము.. గాభరా పడాల్సిందేటీ లేదు..'..'కొంచెం ఏదన్నా తాగడానికి ఇచ్చి పడుకోబెట్టమ్మా..అదే సర్దుకుంటాది..' అని నింపాదిగా చెప్పాడు.. ఆమె పరిస్థితి ఘోరంగా ఉంది.. వెక్కి వెక్కి ఏడుస్తోంది.. దాంతో వాళ్లే ఆ పక్కన ఉన్న ఒక కుక్కి నులక మంచంపై పడుకోబెట్టి.. పక్కింట్లో నుండి ఓ టేబుల్ ఫ్యాను తెచ్చి పెట్టారు.. ఒక అమ్మలక్క ఇంట్లోకి వెళ్లి ఏదో తాగడానికి తెచ్చి ఇచ్చింది..

రాత్రి అవడంతో..మెల్లమెల్లగా ఒక్కొక్కరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు..ఆ వరండాలో.. చీకట్లో అలాగే మంచంపై ఆ మనిషి పడున్నాడు.. వాళ్ళవిడ ఆ మంచం కోడు దగ్గర  దైన్యంగా కూర్చుని ఏడుస్తూ ఉంది..అతను తెలివిలోకి వచ్చినా.. లేచి లోపలకి వెళ్లి లైటు వేసుకునే మనసు లేక..బయట స్ట్రీట్ లైటు వెలుతురు పడుతుండటంతో అటువైపు చూస్తూ ఏదో ఆలోచనల్లో కూరుకు పోయాడు..

                      *        *        *

       ఇంటి నిండా చుట్టాలు పక్కాలతో హడావుడిగా ఉంది.. అంతా ఏర్పాట్లలో మునిగి ఉన్నారు.. అతను మాంచి ఖరీదైన బట్టల్లో మెరిసిపోతున్నాడు.. వచ్చిన వాళ్లంతా..'నీకేంటిరా అదృష్టవంతుడివి.. ఇద్దరూ కొడుకులే..' అని ఒకరంటే..' బావా నీకే హ్యాపీరా.. అంతా రావాల్సిందే కానీ..పోవాల్సింది లేదు..' అని మరొకరు.. అలా వచ్చిన వాళ్లంతా పొగుడుతుంటే.. అతను తన చిన్న కొడుకుని చూసి మురిసిపోతున్నాడు.. ఆరోజు వాళ్ళ చిన్నోడికి బారసాల కావడంతో.. అందరినీ పిలిచి ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేస్తున్నాడు..ఆ రోజుల్లో కొడుకులు అయితే చేతికి ఆందొస్తారు.. చివర్లో సాయంగా ఉంటారు..అదే ఆడపిల్ల అయితే అంతా ఖర్చే..ఏదో ఒకరోజు ఒకలింటికి ఎల్లిపోయేదే.. అనీ ఫీలింగ్ బలంగా ఉండేది..

రోజులు మెల్లగా సాగుతున్నాయి.. ముందునుంచే కాస్త స్థితిమంతుడు కావడంతో.. చేతిలో మంచి విద్య ఉన్నా.. పెద్దగా కష్టపడేవాడు కాదు.. అదీకాక 'నాకేంటి.. ఇద్దరూ కొడుకులే..' అనే ఫీలింగ్ ఒకటి.. పిల్లలు పెద్ద అవుతూ ఉండటంతో పాటు మనోడు గొప్పలకి పోవడంతో .. ఉన్నదంతా ఊడ్చుకుని పోయింది.. చివరికి ఇల్లు కూడా గడవని పరిస్థితి వచ్చేసింది..అయినా కూడా సంపాదనపై దృష్టి పెట్టకుండా ఇంట్లో బంగారంతో పాటు వస్తువులు కూడా అమ్ముకునే స్థితికి దిగజారిపోయాడు.. దాంతో కొడుకులిద్దరినీ సరిగా స్కూలుకి కూడా పంపలేకపోయేవాడు..

ఉన్నట్టుండి..హఠాత్తుగా ఎలా జ్ఞానోదయం అయిందో కానీ..ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో చేరాడు.. ఉదయాన్నే ఆరో గంటకి రెఢీ అయిపోయి.. ఫీల్డ్ మీదకి వెళ్లిపోయేవాడు.. స్వతహాగా చదువుకున్నోడు.. మంచోడు కావడంతో.. తొందరాగానే నిలదొక్కుకున్నాడు.. అన్ని చేదు అలవాట్లను వదిలేసి..సంపాదనపై దృష్టి పెట్టాడు.. దాంతో ఆర్థికంగా కొంత నిలదొక్కుకున్నాడు.. సొంతంగా ఇల్లు..బండి కొనుక్కోవడంతో పాటు..ఇద్దరు కొడుకుల్ని దగ్గర్లోని టౌనులో పెద్ద స్కూల్లో జాయిన్ చేసాడు..


అలా సంవత్సారాలు గడుస్తున్నాయి.. మనోడికి వయసు మీద పడుతోంది..ఎంత ఖర్చు పెట్టినా కూడా.. పెద్దోడికి చదువుపై పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడంతో మరి చదవనని మొండికేశాడు.. దాంతో 'ఎలాగైనా తన కొడుకుల్ని బాగా చదివించి..గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని చేయాలన్న'.. తన కోరిక నెరవేరేలా కన్పించలేదు.. దాంతో పెద్దోడిని.. వాళ్ళ కాళ్ళు..వీళ్ల కాళ్ళు పట్టుకుని..బోల్డంత డబ్బు తగలేసి.. దగ్గర్లో ఉన్న ఓ కంపెనీలో జాయిన్ చేసాడు.. ఆ తర్వాత తనకు టౌన్ లో ఉన్న చిన్న ఇంటిని తన పేరు మార్చి..పెళ్లి చేసాడు..

పెద్దోడు అలా అవటంతో..చిన్నోడిని అయినా బాగా చదివించాలని నిర్ణయించుకున్నాడు.. వాడు చాలా యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ చాలా డోనేషన్లు కట్టి.. డిగ్రీ..పీజీ.. చేయించాడు.. తాహతకు మించి డబ్బు పెట్టి కోచింగులకు పంపించాడు.. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.. దాంతో తాను సంపాదించింది అంతా కరిగిపోయింది..మరోవైపు వయసు మళ్లుతుండటంతో.. మునుపటిలా ఫీల్డ్ మీద తిరగలేకపోతున్నాడు..ఆదాయం తగ్గిపోసాగింది..

ఊళ్ళో చాలామంది కుర్రాళ్ళు కష్టపడి ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు..దాంతో మనోడిని రకరకాలుగా దెప్పిపొడుస్తుండేవారు.. ఊళ్ళో ఉంటే ఎక్కడ తన కొడుకు ఇలాంటి మాటలు విని నిరుత్సాహ పడతాడేమో అని..ఊరికి దూరంగా సిటీలో రూమ్ తీసి ఉంచేవాడు.. ఇలా చాలా సంవత్సరాలు మనోడు ప్రిపరేషన్ పేరుతో కాలం వెళ్లదీస్తుండటంతో.. కొడుక్కి నెలనెలా పంపడానికి అప్పులు చేయసాగాడు.. దాంతో బంధువులు.. ఊళ్ళో వాళ్ళు మనోడికి '..,ఇప్పటికే నీ తాహతకు మించి పెట్టవు..ఉన్నదంతా ఊర్చి చదివించావు.. ఇకనైనా మీ చిన్నోడికి ఎందులోనైనా జాయిన్ చేయు.. నాలుగు డబ్బులు సంపాదించి నీకు సాయంగా ఉంటాడు..' అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు..

వాళ్ళావిడకి మాత్రం ఇవన్నీ అనవసరం.. తన పనేదో తనది..ఊర్లో కానీ..చుట్టాల్లో కానీ ఏ ఫంక్షన్ కి వెళ్లినా ఇదే చర్చ.. దాంతో చాలా వరకు వెళ్ళటం మానేశాడు..చిన్న కొడుకు కూడా ఒక దశలో '..నాన్నా నేను మరి చదవలేను.. నావల్ల కాదు.. ఏదో  ఒకదాంట్లో జాయిన్ అయిపోతాను..'అని అన్నప్పటికీ..' డబ్బు సంగతి నీకెందుకు.. నువ్వు కాంసెంట్రేషన్ చేసి..చివరిగా గట్టి ప్రయత్నం చేయు..' అని చెప్పాడు.. ఇక ఏమి మిగలక పోవడంతో.. ఉన్న ఆ చిన్న
ఇల్లుని తాకట్టు పెట్టి..ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశాడు..ఇల్లుని తాకట్టు పెట్టడంతో పెద్ద కొడుకు వచ్చి నానా రభస చేశాడు.. చివరికి తండ్రిపైకి కొట్టడానికి కూడా వెళ్ళాడు..

'..బాగా పొద్దు పోయింది.. లేచి ఏదైనా ఇంత ఎంగిలి పడండి...' అన్న మాటతో.. ఒక్కసారిగా ఈలోకంలోకి వచ్చాడు.. '..తను నా కంటి నుండి కారుతున్న కనీళ్ళని  తుడుస్తూ..' ఏంటి నీ కొడుకులు యాద కొచ్చినారా?..' ,అంటూ అమాయకంగా అడుగుతూ చేతిలో అన్నం కంచం పెట్టింది..
        

03.04.2018

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

మొబైలోపాఖ్యానం