...హెయిర్ కటింగ్ | ఫణీంద్ర కుప్పిలి

...హెయిర్ కటింగ్ | ఫణీంద్ర కుప్పిలి


'...మరీ అలా బూచోడి లాగా 🤓 అంతెత్తు జుట్టు వేసుకుంటా తిరగకపోతే వెళ్లి కటింగ్ వేయించుకు రావచ్చు కదా.. వారం రోజులలో పెళ్లి కూడా ఉంది ఇప్పుడు చేయించుకుంటే.. అప్పటి సరికి బాగా వస్తుంది అంటూ..' అని మా ఆవిడ పొద్దున్నుండి నసపెడుతుంటే.. ఇక తప్పేలా లేదు అనుకుంటూ..రాత్రి ఎనిమిదింటికి ఓ మాసిన బనీను ఒకటి మీద వేసుకుని బయలుదేరా..అదేంటో.. నాకు హాస్పిటల్ అన్నా..హెయిర్ సెలూన్ అన్నా విపరీతమైన వణుకు.. ఆరెండింటి తోనూ నాకున్న అనుభవాలు అలాంటివి.. సాధారణంగా మనలో చాలా మంది..ఆసుపత్రి అంటే భయపడటం సహజం..మరి నా కటింగ్ గోల ఏంటి అని అనుకుంటున్నారా.. కొంచెం ఓపిక పడితే మీకు అర్థమవుతుంది😀

మొత్తానికి మా ఆవిడ పోరు పడలేక..పక్క వీధి చివర్లో ఉన్న ఓ సెలూన్ లోకి భయం భయంగా.. చిన్న పిల్లోడు మొదటి సారి బడిలోకి అడుగు పెట్టినట్లు..☹️ అడుగు పెట్టా.. అంతే.. లోపలున్న '..మా మల్లేశం'.. మంత్రి మహాశయుడు.. గభాలున నన్ను ఓ పెద్ద తిరుగుడు కుర్చీలోకి కూలదోశాడు.. '..ఏటయిపోనారు బాబు.. అప్పుడెప్పుడో.. కొత్త ఆమాసకి..కటింగ్ ఏశాను..మళ్లీ మీరు మారు అవుపడలేదు.. ఏటయిపోనారేటి?..' అంటూ.. కింద సొరుగు నుండి జయలలిత బులెట్ ప్రూఫ్ గౌను లాంటిది ఒకటి తీసి.. మెడ చుట్టూ తగిలించేశాడు.. అదేంటో గాని.. దాన్ని పీక చుట్టూ చుట్టి పెడితే.. నాకు మాత్రం..పీకకి ఉరేసినట్లు అనిపిస్తుంది..

ఇహ అంతే.. జుట్టుపై లైట్ గా వాటర్ స్ప్రే చేస్తూ మెల్లగా వేళ్ళతో సరిచేస్తుంటే..అప్పటి వరకు.. బాల సాయిబాబా లాగా ఉన్న జుట్టు కాస్తా.. బోయపాటి సినిమాలో బాలయ్య బాబు హెయిర్ స్టయిల్లా😁 చేత్తోనే మార్చేశాడు.. సెలూన్ కొచ్చిన ప్రతీసారీ ఇంతే.. ఇంటిదగ్గర ఉన్నపుడు.. అంత జుట్టుతో పిచ్చోడిలా కనిపించే నేను.. మల్లేశం చేతిలో తల పడగానే.. అదేంటో గానీ ఒద్దికగా ఒదిగిపోతుంది.. ఛ.. అనవసరంగా వచ్చానే.. అనుకుంటూ.. ఈసారైనా నేను చెప్పినట్లు కుంచెం చెయ్ అంటూ.. మోహమాటంతో కూడిన భయవలన కలిగిన సిగ్గుతో చెప్పా.. ఎక్కడైనా ఆప్షన్లు ఉంటాయేమో గానీ..మా మల్లేశం దగ్గర మాత్రం అప్షన్లుండవ్.. బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా.. ఒకటే చూపించి.. సెలెక్ట్ చేసుకోమనే రకం.. పైగా ఆడు '..ఒకసారి మైండ్ లో ఫిక్స్ అయితే.. బ్లైండ్ గావేసేయడమే అంట కత్తెర..'🤣🤣

గతంలోని చేదు అనుభవాలు దృష్ట్యా.. ' ఒరేయ్ బాబూ.. ఆ మోడల్స్ అవీ నాకు సూటవ్వవు గానీ.. మామూలు ప్లెయిన్ కటింగ్ ఎయ్యరా బాబు..పైగా ఓ వారం లో పెళ్లిళ్లు ఉన్నాయి..అంతే కాక నీ దెబ్బకి ఆఫీసులో కూడా టోపి పెట్టుకుని తిరగాల్సి వస్తోంది..' అని ఇంచుమించు.. బ్రతిమలాడుకున్నా.. దానికి ఆడు ఎప్పటిలాగే.. మరి మామూలుగానే అంటాడో.. లేదంటే నా వీక్నెస్ పట్టుకుని అంటాడో గానీ..' అదేటి బాబు అలగంటారు.. ఈపాలి సూడండి.. దుళ్లగొట్టేస్తాను.. అచ్చం కలెట్టరు బాబులా ఉంటారు ఈ కటింగులో..' 😘అని ఆడు..'..కత్తెరని టక టక మనిపిస్తూ.. రంగంలోకి దూకేశాడు..'

ఈ ప్రపంచంలో.. ఫ్యూన్ నుండి పి.యమ్ దాకా ఎవరి మెడ మీదనైనా..ధైర్యంగా కత్తి పెట్టగల ఏకైక ధీరుడు.. మన మంత్రివర్యులే☺️.. ఎంతటి వారులైనా.. మంత్రిదాసులే కదా..అని ఇక నేను చేసేది ఏమీ లేక.. శిల్పి చేతిలో ఒదిగిపోయిన శిలలా.. వాడి చేతిలో నా తలను పెట్టి.. ఆ దారుణాన్ని చూడలేనట్లుగా గట్టిగా కళ్ళు మూసుకున్నా.. మొత్తానికి ఏ ఛానెల్ ని ఒక నిముషానికి మించి ఉంచకుండా.. రకరకాల విన్యాసాలతో కటింగ్ పూర్తిచేశాడు.. నేను ఎలా ఉందో అని అద్దంలో చూసుకునే లోపే.. మీకు గడ్డం అసలు బాగోదు సార్ అంటూ..  ట్రిమ్మర్ ని తీసుకొచ్చి మెడ మీద పెట్టాడు.. నేను కెవ్వున అరుస్తూ..' నీకు పుణ్యం ఉంటాదిరా బాబు.. దాని జోలికెళ్లకు..' అని అనేలోపే.. పారతో చెక్కినట్టుగా..ఒక మడకని లేపేశాడు.. ఇంక చేసేది ఏమీ లేక అన్నీ మూసుకుని కూర్చున్నా😁..ఒక రెండు నిముషాల్లో జంగిల్ క్లియరెన్స్ చేసినట్టు చేసిపారేశాడు..

ఇకనైనా లేచి బయలుదేరుదామంటే.. అసలు ఘట్టానికి తెరలేపాడు.. బహుశా ఆ రోజు ఆడికి బిజినెస్ లేదేమో గావాల... ఎలాగైనా.. నాకు ఫేషియల్ చేసి టార్గెట్ పూర్తి చేద్దామని డిసైడ్ అయినట్లున్నాడు..' వద్దురా బాబూ.. ఇప్పటికే చాలా ఆలస్యమైంది..ఇంకోసారి పెట్టుకుందాం రా అంటే..' వదిలిపెడతాడా.. '..ఊరుకోండి బాబూ..మీరొచ్చేదే.. అత్తారింటికి కొత్తల్లుడిలా.. సంవత్సరానికి ఓ మూడో.. నాలుగో సార్లు..ఇపుడు కూడా మీకు మనస్ఫూర్తిగా చేయకపోతే ఎలా..'అంటూ మోహమాటంతో కూడిన ఆదేశాన్ని జారీ చేసేశాడు.. 


ఇక అంతే..మీరు ఈ ఘోరాన్ని చూడలేరు అన్నట్లుగా.. న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టినట్లుగా..ఓ రెండు దూది బిండల్ని(..అదే కాటన్ ప్యాడ్స్..)  పెట్టీసి..రకరకాలు క్రీముల్ని రాసి.. మొహాన్ని డబ్బిది దిబ్బిది చేసేసాడు.. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఏదో ఒక క్రీముని ముక్కు దగ్గర పెట్టి.. వాసన ఎలా ఉంది అని అడిగి..నేను చెప్పే లోపే..' కొత్తగా మార్కెట్లోకి వచ్చింది బాబూ..వాసన అదిరిపోయింది కదా..' అని ఆడే చెప్పేస్తాడు.. అర్ణబ్ గోస్వామి డిబేట్ లో లాగా..ఎంత మంచోడో కదా.. క్వశ్చన్.. ఆన్సర్.. రెండూ ఆడే చెప్పేస్తాడు.. అంతే సడెన్ గా మనోడి అలికిడి లేదు.. పోనీ ఆ ఎల్లినోడు టీవీలో ఏదైనా మ్యూజిక్ ఛానెల్ పెట్టిపోయినా బాగుండేది.. నా ఖర్మ కాలి.. ఆడు టి.వి5 డిబేట్ పెట్టి పోయాడు.. సరిలే అని ఓ చెవి డిబేట్ మీద విసిరా.. అంతే.. రెండు నిముషాల్లోనే.. నవారంధ్రాల నుండి రక్తం కారేలా ఉంది..ఎందుకైనా మంచిదని ఓ సారి నా రెండు చెవుల్ని తడిమి చూసుకున్నా🤣🤣.. ఇక చేసేది లేక.. కళ్ళతో పాటు చెవుల్ని మూసుకుని అలా గతంలోకి జారుకున్నా..

                     *          *          *

ఇపుడేంటో గానీ అంతా ఇంతేసి గెడ్డాలేసుకుని ఫ్యాషన్ అని తిరుగుతున్నారు గానీ.. అప్పుడు మాత్రం..మాకు ఎపుడు గెడ్డం వస్తుందా.. గీకేసుకుందామా అని ఉండేది.. మొత్తానికి ఆ మోజులో ఎలా బడితే అలా కొన్నేళ్ళు బరికేయడంతో.. మరీ ముళ్ళ దొంకలా తయారైంది.. దాంతో కొన్నాళ్లు పాటు.. ఈ ' స్వచ్చ భారత్' కార్యక్రమానికి స్వస్తి పలికి.. నేను కూడా గడ్డంతో కాలం వెళ్లదీస్తున్నా.. ఈలోగా మ్యారేజ్ ఫిక్స్ అవడం తో పాటు.. మా ఆవిడ కూడా విత్ గెడ్డం ఫెసుకి బాగా ఫిక్స్ అయిపోయింది.. పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత జుట్టు బాగా పెరిగిపోవడంతో..మా మల్లేశం సెలూన్ కి వెళ్లి వచ్చా..

ఇంటికొచ్చి కాలింగ్ బెల్లు నొక్కడంతో తలుపు తీసిన మా ఆవిడ నన్ను చూసి.. ఒక్కసారి కెవ్వుమని అరిచింది.. దాంతో నేను.. 'ఎమోషన్ లో మా మల్లేశం గాడు కొంపదీసి కనుబొమలు కూడా గీసేసాడా ఏంటని పరిగెత్తుకుంటూ వెళ్లి అద్దంలో చూసుకున్నా'.. నాకేమీ అర్థం కాలేదు.. ఈలోగా మా ఆవిడ పడీ పడీ నవ్వుతూ.. అన్నీ గీసేస్తే నువ్వు అచ్చం అముల్ స్ప్రే డబ్బా మీద '..అముల్ బేబీలా..'😫 ఉన్నావని అనడంతో.. యాభయ్యో పడిలోకి రాబోతున్నా.. ఇంకా పసి బుగ్గల పాల పాపాయి అని కీర్తించబడే మన 'రాహుల్ బాబా'లాగా😷.. రిటైర్మెంట్ వయసు వరకూ ' నిరుద్యోగ పోరాట సమితి' అధ్యక్షునిగా కొనసాగిన ఓ ప్రముఖ యువ నేతలాగా🤐..ఇదెక్కడి కష్టం వచ్చి పడిందిరా భగవంతుడా ..

అందరూ యంగ్ గా కనబడటానికి నానా వార్నీషు కష్టాలు పడుతుండే.. కొంచెం వయసు కనబడటానికి నాకీ గడ్డం బాదేంటిరా బాబూ అనుకున్నా.. మన 'బాబు' గారిలా గడ్డం అక్కడక్కడా నెరిసినా.. ఆరోజు నుండి.. నీర్లాక్.. ఏషియన్ పెయింట్స్ లాంటి వాటి జోలికి పోకుండా..మన విజయసాయిరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటూ గుట్టుగా ముందుకు సాగిపోతున్నా..
                          *          *          *
ఎంత టైము అయిందో కూడా తెలీదు..మళ్లీ సడెన్ గా మనోడు దగ్గరకొచ్చి ఏదో రాస్తున్నట్లుగా అనిపించి..' ..ఏంటి మల్లేశం.. ఏదన్నా కొత్త ఫ్లేవరా🙄🙄 డిఫరెంట్ గా ఉంది అని అడిగా..' దానికి ఆడు..' ఊరుకోండి బాబు..మీరు మరీనూ..ప్యాక్ అరేసరికి టైము పడుతుందని..అలా బయటికి వెళ్లి..ఓ దమ్మేసి వస్తున్నా..' అంటూ ' ఖల్.. ఖల్ ' అంటూ నవ్వాడు(..దగ్గాడు😂)..ఆరబెట్టి పోవడానికి..ఇదేమన్నా..అప్పడాలు.. చిన్నొడియాలా.. అనుకుంటూ..సర్లేగానీ ఇంకెంత టైము పడుతుంది అని అడిగా..' ..అయిపోయింది బాబు..ఇంకా తీసేయడమే..' అంటూ.. సున్నాలు వేసేముందు..గోడకి పెచ్చులుడదీసినట్లు..పీకి పారేశాడు.. కొంచెం ముఖం వాష్ చేశాక..ఏదో కోమా నుండి బయటికి వచ్చినోడిలా..కళ్ళు తెరిచి అద్దంలో ముఖారవిందాన్ని చూసుకుండామనుకునే లోపు.. పేటియం కార్డుని నా ముఖం మీద ఉంచాడు.. అర్థమయ్యిపోయింది.. గాట్టిగానే బాదేసుంటాడాని.. అందుకే..ఫోన్ లాక్ ఓపెన్ చేసి..బిల్లు కొట్టుకోమని ఆది చేతికే ఇచ్చా.. 'కీక్. కీక్..'మనే సౌండుతో.. ఆడు..అయిపోయింది బాబు.. సూసుకోండి అంటూ మొబైల్ నాచేతిలో పెట్టాడు..  నేను మాత్రం నా అందాన్ని🤔 ఆదుర్దాగా అద్దంలో చూసుకున్నా.. ఇంకేముంది.. సోడాకారం దెబ్బకి ఎలిసిపోయిన గలేబు గడ్డలా తయారైంది మొహం..

'..ఈపాలి దుల్లగొట్టేశాను కదా బాబు..'అంటూ ఎలక్షన్లలో బంపర్ మెజార్టీతో గెలిసినోడిలా వికట్టహాసం చేస్తు ఆడు.. డిపాజిట్టు గల్లంతై..మొహం చాటేసుకుంటూ.. కౌంటింగ్ సెంటర్నుండి బయటకొచ్చినోడిలా నేను.. సరే అయిందేదో అయిపోయిందనుకుని.. టైము చూసుకున్న.. డేట్ మారడానికి ఇంకో రెండు గంటలుంది.ఆ టైములో ఈ మొహం పెట్టుకొని వెళితే ఇంటిలో దబిడి దిబిడి అయిపోతుందని.. బండిలో మిగిలిన అరలీటర్ పెట్రోల్ ఆరిపోయేదాకా అక్కడా ఇక్కడా తిరిగి.. మా ఆవిడ నిద్ర మత్తులో ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక.. ఈసురోమంటూ కొంపకి చేరా🤣..

24.04.2019

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

మొబైలోపాఖ్యానం

(అ)పుత్రస్య గతిర్నాస్తి..