Posts

Showing posts from January, 2026

మరీచిక | ఫణీంద్ర కుప్పిలి

మరీచిక | ఫణీంద్ర కుప్పిలి  జన కీకారణ్యంలోని రణగొణ ధ్వనుల మధ్య ఓ గొంతు శ్రావ్యంగా వినిపిస్తుంది.. ఈ గజిబిజి గందరగోళ లోకంలో ఓ మాయ నన్ను లిప్తపాటు స్థానువుని చేస్తుంది.. ఈ జీవన గమనంలో అనేక మంది తారసపడతారు.. కొంతమంది అపరిచితులుగా వెళ్ళిపోతారు.. మరికొంతమంది తన ఉనికిని చాటుతారు.. అతి కొద్ది మంది మాత్రం  అర క్షణంలో సుగంధ పరిమళంలా అల్లుకుపోతారు.. చాలా కాలం పాటు మనసుల్ని పెనవేసుకుపోతారు.. ఆ ఆనందాన్ని ఆస్వాదించేలోపే  మన మనసుల్ని నిర్దాక్షిణ్యంగా చిద్రం చేసి  అంతులేని బాధను మిగిల్చి హఠాత్తుగా అదృశ్యమవుతారు.. ముందు కదలాడే ఆ రూపం.. ఇప్పుడు పట్టుకుందామన్నా చిక్కని మరీచిక.. గుండె గదిలో నిశ్శబ్దంగా పేర్చుకున్న ఆశలన్నీ నేడు ముక్కలై గుచ్చుకుంటున్న గాజు పెంకులు.. ​వారొచ్చిన దారిలో ఇంకా పరిమళం ఆవిరవ్వలేదు కానీ ఆ స్పర్శ మాత్రం శాశ్వతంగా దూరమైంది.. ప్రాణం ఉన్న శవమై తిరుగుతున్నా ఈ జనారణ్యంలో నా మౌనం చేసే రోదన ఎవరికీ వినబడదు.. ​ప్రశ్నార్థకమైన ఈ ఒంటరి ప్రయాణంలో శిలలా మిగిలిపోవడం తప్ప ఏమీ చేయలేను.. మరణం ఇచ్చే గాయం ఒక్క క్షణమేమో కానీ ఈ జ్ఞాపకం ఇచ్చే నరకం.. అనుక్షణం అనుభవించాల్సిందే! 21.01.2026...

తిరుగు ప్రయాణం | ఫణీంద్ర కుప్పిలి

తిరుగు ప్రయాణం | ఫణీంద్ర కుప్పిలి  సంక్రాంతి ముగిసింది.. సంబరాలు ముగిసాయి.. ​మూటకట్టిన ఊరి జ్ఞాపకాలు.. కంట తడిపెట్టిన అమ్మ దీవెనలు.. మళ్ళీ వచ్చే దాకా తోడుండే అయ్య పంపిన అరటి గెలలు.. ​బస్సు కిటికీలోంచి చూస్తుంటే.. దూరంగా జరుగుతున్న ఊరి పొలిమేర.. మళ్ళీ కలుస్తామా అన్నట్టు.. వీడ్కోలు పలుకుతున్న పచ్చని చేలు.. అమ్మ చేతి సద్ది మూట.. నాన్న చెప్పిన జాగ్రత్తల మాట.. రైలు కూతలో కలిసిపోతున్న ఆత్మీయుల వీడ్కోలు పాట.. ​కళ్ళ ముందు నగరపు హోరు.. గుండె నిండా పల్లెటూరి జోరు.. రెక్కలు అలిసినా ఆగని పయనం.. బతుకు చక్రంలో ఇదొక నిత్య గమనం.. కాంక్రీటు అడవిలో కాలం గడపాలి.. యాంత్రిక జీవనంలో ఇన్నాళ్లు నలగాలి.. గూటికి చేరే ఆ ఒక్క పండుగ కోసం మళ్ళీ ఏడాది పొడవునా వేచి చూడాలి.. 17.01.2026

నిశ్శబ్ద జ్వాల | ఫణీంద్ర కుప్పిలి

  నిశ్శబ్ద జ్వాల | ఫణీంద్ర కుప్పిలి  నమ్మకాల చితిపై రగిలిన సంధ్యాజ్వాలల్లో నడక నేర్పిన నిశ్శబ్ద ధైర్యాలెన్నో.. ఆశల రేకులు రాలి అంతర్థానమైనా పునర్జన్మకై తపించే ప్రాణస్పందనలెన్నో.. గతపు గాయాల నీడలు శ్వాసను ముట్టడిస్తుంటే, జ్ఞాపకాల సుడులు వర్తమానాన్ని కబళిస్తుంటే.. భాషకు అందని వేదనల భారమంతా మౌనమనే మహాసముద్రంలో కరిగిపోతోంది.. పంచుకోలేని వ్యథలు శిలలై గడ్డకట్టి హృదయ ద్వారాలను బంధించినా, అందని ఆదరణకై ఆత్మ చేసే అన్వేషణ నిశ్శబ్దంగా అంతరాత్మను శోధిస్తూనే ఉంటుంది.. పరాజయాల విషాన్ని అమృతంగా భావించి, చిరునవ్వునే ఓ కవచంగా ధరించిన యోధులెందరో.. నిశీధిని దాటే ఒక్క ఆశాకిరణం కోసం కాలాన్నే కంటిపాపగా మార్చుకున్న రాత్రులెన్నో.. 06.01.2026