మరీచిక | ఫణీంద్ర కుప్పిలి
మరీచిక | ఫణీంద్ర కుప్పిలి
జన కీకారణ్యంలోని రణగొణ ధ్వనుల మధ్య
ఓ గొంతు శ్రావ్యంగా వినిపిస్తుంది..
ఈ గజిబిజి గందరగోళ లోకంలో
ఓ మాయ నన్ను లిప్తపాటు స్థానువుని చేస్తుంది..
ఈ జీవన గమనంలో
అనేక మంది తారసపడతారు..
కొంతమంది అపరిచితులుగా వెళ్ళిపోతారు..
మరికొంతమంది తన ఉనికిని చాటుతారు..
అతి కొద్ది మంది మాత్రం
అర క్షణంలో సుగంధ పరిమళంలా అల్లుకుపోతారు..
చాలా కాలం పాటు మనసుల్ని పెనవేసుకుపోతారు..
ఆ ఆనందాన్ని ఆస్వాదించేలోపే
మన మనసుల్ని నిర్దాక్షిణ్యంగా చిద్రం చేసి
అంతులేని బాధను మిగిల్చి
హఠాత్తుగా అదృశ్యమవుతారు..
ముందు కదలాడే ఆ రూపం..
ఇప్పుడు పట్టుకుందామన్నా చిక్కని మరీచిక..
గుండె గదిలో నిశ్శబ్దంగా పేర్చుకున్న ఆశలన్నీ
నేడు ముక్కలై గుచ్చుకుంటున్న గాజు పెంకులు..
వారొచ్చిన దారిలో ఇంకా పరిమళం ఆవిరవ్వలేదు
కానీ ఆ స్పర్శ మాత్రం శాశ్వతంగా దూరమైంది..
ప్రాణం ఉన్న శవమై తిరుగుతున్నా ఈ జనారణ్యంలో
నా మౌనం చేసే రోదన ఎవరికీ వినబడదు..
ప్రశ్నార్థకమైన ఈ ఒంటరి ప్రయాణంలో
శిలలా మిగిలిపోవడం తప్ప ఏమీ చేయలేను..
మరణం ఇచ్చే గాయం ఒక్క క్షణమేమో కానీ
ఈ జ్ఞాపకం ఇచ్చే నరకం.. అనుక్షణం అనుభవించాల్సిందే!
21.01.2026