నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

బయట చీకటి బొట్లబొట్లగా కురుస్తోంది,

మనసు..తాడు తెగిన గాలిపటంలా,

గమ్యం లేని గాలిలో తేలుతోంది..

చేసిన బాసలు చెవిలో జోరీగలా తిరుగుతున్నాయి..

నిశ్శబ్దం నాలో నిశ్చలంగా పేరుకుంటోంది..

గుండె లోతుల్లో అసహనం ఒంటరిగా మూలుగుతోంది..

ఆలోచనలు చీకటిని మరింత లోతుకి తీసుకెళ్తున్నా,

ఒక చిన్న ఆశా కిరణం దారి వెతుక్కుంది..

కళ్లు మూసినప్పుడు కనిపించే ఆశలా..

విరిగిన కలల ముక్కల్లోనే,

కొత్త కలల సౌరభం పూస్తోంది..

తడబడిన అడుగుల్లోనే,

కొత్త పయనం పలుకుతోంది..

నన్ను నేనే చుట్టుకుంటాను,

నిశ్శబ్దాన్ని దాటి గాలిలో ఎగురుతాను..

ఈసారి తాడు నా చేతిలోనే,

ఈసారి దిక్కు నాకు తెలుసు..

ఇది ముగింపు కాదని,

మనసు మెల్లగా చెప్పుకుంటోంది.

ఈ చీకటి వెనకే,

వెలుగు బలంగా విరబూస్తుంది..

14.05.2025

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం