అణువులో అనంతం | ఫణీంద్ర కుప్పిలి
అణువులో అనంతం | ఫణీంద్ర కుప్పిలి అపార నిశ్శబ్ద గగనంలో నిలిచిన నేను తారల మెరుపుల మధ్య ధూళికణమని గ్రహించాను అయినా ఆ ధూళికణమే బ్రహ్మాండ శ్వాసలో ఒక మంత్రాక్షరంలా దాగి ఉంది. శ్వాసలొక ప్రవాహం, అడుగులొక తాత్కాలిక ముద్ర కానీ ఆ తాత్కాలికతలోనే శాశ్వతం తన రూపాన్ని ఆవిష్కరిస్తుంది.. దూర తారలు జపమాలల ముత్యాల్లా జిగేల్మంటూ నా అంతరంగ ప్రశ్నలకు మౌన సమాధానమిస్తాయి.. "నీవు ఒంటరివి కాదు..నీవే విశ్వమై ఉన్నావు." నేనొక అణువు,.. కానీ ఆ అణువులోనే అనంతం విస్తరిస్తోంది.. నా ప్రేమ విశ్వానికి జ్యోతి, నా కలలు ఆకాశానికి వర్ణం, నా బాధలు మౌనానికి రాగం.. వేల వేల కాలాలు నా హృదయ తాళంలో ఒకే లయలో కొట్టుకుంటున్నాయి.. గతం, వర్తమానం, భవిష్యత్తు ఒకే క్షణంలో కరిగిపోతున్నాయి.. నా కన్నీళ్లు నదుల మూలం, నా నవ్వు వసంతపు హరివిల్లు, నా మౌనం లోతైన సముద్రపు అఖాతం.. ఇలా నా ఉనికిలోనే అపార బ్రహ్మాండం తన ప్రతిబింబాన్ని దర్శిస్తోంది.. నేను చూస్తున్న ప్రతి క్షణం విశ్వం తనను తాను గుర్తుంచుకుంటున్న క్షణం... 13.09.2025