విరాగ దర్శనం | ఫణీంద్ర కుప్పిలి
విరాగ దర్శనం | ఫణీంద్ర కుప్పిలి
ఆస్తుల వెతలు, బంధాల బరువులు,
భయాల గూళ్ళు, ద్వేషాల కుంపటి.
ఈ భవబంధాలన్నీ తెంచుకుని,
మౌనం ధరించి విరాగిలా నిలిచి,
శ్మశానపు అంచున శిలవై పడి ఉండు.
కానీ...
వ్యక్తపరచని భావాలు,
మరిచిన క్షణాల మాధుర్యం,
చేయాల్సిన పనుల చితి,
ప్రేమించాల్సిన ఆత్మల ఆర్తనాదం
ఇవే నిన్ను వెంటాడుతూ ఉంటాయి..
చివరికి ఆ కఠినమైన రోజు వస్తుంది,
నీవు విముక్తి పొందుతావు.
ఆకాశం విరగదు, భూమి బ్రద్దలు కాదు,
తారలు కన్నీరు పెట్టవు, కాలం ఆగదు,
మనిషి తన పరుగు ఆపడు.
తరువాత...
చాలామంది నిన్ను మర్చిపోతారు,
కొద్దిమంది ప్రేమగా తలుస్తారు,
అమితంగా ప్రేమించినవారు దైవంగా కొలుస్తారు.
నీ ధనమంతా నిమిషంలో పరుల పాలౌతుంది.
మిగిలేది నీ మంచి-చెడులే,
అవే నీ విలువను నిలబెడతాయి,
నిన్ను శాశ్వతం చేస్తాయి.
05.12.2025