ఆరని చితి | ఫణీంద్ర కుప్పిలి

 ఆరని చితి | ఫణీంద్ర కుప్పిలి

కళ్లకి కన్నీళ్ళ పువ్వులు పూచాయి..

అవి ఒక్కొక్కటిగా గుండెలోకి జారి

గుండె చెరువయ్యింది...

కళ్లు పొడిబారాయి...


మదమెక్కి మతి తప్పిన ఉగ్రవాద మూకలు

మనుషుల రక్తంతో హోలీ ఆడుతున్నాయి..

చెల్లాచెదురుగా తెగిపడిన మొండేలు..

తుఫాను తాకిడికి నేలకొరిగిన

అరటి బోదెల్ని తలపిస్తున్నాయి..


భూతల స్వర్గంగా పేరుగాంచిన కాశ్మీరం..

నేడు భూతాల దుర్గంగా మారిన వేళ..


వేయి తూటాలకి సమానమైన

'హిమాన్షి' విషాద భరిత నిర్వేద చూపులు..

దాయాది దేశపు దమన నీతిని

చేష్టలుడిగి చూస్తున్న..

యావత్తు ప్రపంచపటాన్ని

ఛిద్రం చేసేలా ఉన్నాయి..


కాశ్మీర్ వేర్పాటువాదం..

భరతమాత శరీరంపై

నిత్యం రసికారుతున్న రాచపుండు అయితే,

వెంటాడుతున్న ఉగ్రభూతం..

యావత్తు భూగోళాన్ని

కబళిస్తోన్న క్యాన్సరు కణం వంటిది...

22.05.2025

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం