మరీ ఇంత అమాయకురాలేంటో.. | ఫణీంద్ర కుప్పిలి
మరీ ఇంత అమాయకురాలేంటో.. | ఫణీంద్ర కుప్పిలి
తినటానికి నలుగురుండి..
ముగ్గురికి మాత్రమే సరిపోయేంత ఉన్నపుడు..
నాకు ఆకలిగా లేదని..
మంచి నీళ్ళతో సరిపెట్టుకుంటుంది..
మనం లొట్టలేసుకుంటూ తింటుంటే..
తన కడుపు నిండినట్లు సంతోష పడుతుంది..
మనందరం సెలవుల్ని ఆస్వాదిస్తుంటే..
తను మాత్రం ఓవర్ టైం చేస్తుంది..
తనకు సుస్తీ చేసిన పూట కూడా
మనం ఎక్కడ పస్తులుంటామోనని..
తనకేమీ కాలేదని
లేని శక్తిని కూడదీసుకుంటుంది..
గడియారంలో ముల్లులా నిరంతరం
సమయంతో పోటీపడి పరుగుపెడుతుంది..
అయినా తన చేస్తున్న పనికి గుర్తింపులేదు..
ఆ మాటకొస్తే ఆశించదు కూడా..
మనకంటే తక్కువ చదువుకోవచ్చు..
మనకున్నంత లోకజ్ఞానం లేకపోవచ్చు..
మనకు తెలిసిన ఎన్నో విషయాలు
తనకు తెలియకపోవచ్చు..
కానీ తనకు తెలిసిందల్లా ఒక్కటే..
మనం ద్వేషించినా కూడా..
తిరిగి అంతులేని ప్రేమని పంచడమే..
ఇపుడు కొత్తగా వైఫై లు..
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లు వచ్చాయి గానీ..
జీవి ఊపిరి పోసుకున్న నాటి నుండి.
అమ్మ మనతో నిరంతరం కనెక్ట్ అయ్యే ఉంది..
మన చుట్టూ తన మమకారాన్ని..
అనుక్షణం వైఫై లా ప్రసరిస్తూనే ఉంది..
తన ఒడిలో కూర్చోబెట్టుకుని
గోరుముద్దలు తినిపించిన అమ్మ
నేడు ముదిమి వయసులో
పట్టెడన్నం కోసం అర్రులు చాస్తోంది..
ఆప్యాయమైన పలకరింపు
కోసం అనుక్షణం కలవరిస్తోంది..
అమ్మ మరీ ఇంత అమాయకురాలేంటో?
ఏదో నవమాసాలు మోసి..
కంటికి రెప్పలా కాపాడుకున్నంత మాత్రాన..
నేడు ఎంతో ఉన్నతస్థానాలకి ఎదిగిన మనం..
వయసుడిగిన ఆ ముసలి తల్లి
పక్కన కూర్చుని..
ఆప్యాయంగా అనునయించే తీరిక ఎక్కడుంటుందని?
మనం ఎంత ద్వేషించినా.. దూషించినా
తను మాత్రం తుది శ్వాస వరకు..
మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది..
08.07.2020