ఆజాదీ కీ అమృత మహోత్సవ వేళ | ఫణీంద్ర కుప్పిలి
ఆజాదీ కీ అమృత మహోత్సవ వేళ | ఫణీంద్ర కుప్పిలి
జాబిలిపై మువ్వన్నెల జెండా రెపరెప లాడే లోగానే
మణిపూర్ పాశవిక దమనకాండ..
మన వేద భూమి విలువల వలువలు ఊడదీసి
ట్విట్టర్ పిట్ట సాక్షిగా బట్టబయలు చేసింది ..
ఒక గిరిజన మహిళ దేశాధ్యక్ష పదవి అలంకరించిందని మనం జబ్బలు చరచు కునేలోగా..
మరో గిరిజన మహిళ నగ్న ఊరేగింపు
సభ్య సమాజంలో మనల్ని నవ్వులపాలు చేసింది..
ఆజాదీ కీ అమృత్ మహోత్సవ వేళ..
మణిపూర్ లో జరిగిన భారత మాత నగ్న ఊరేగింపు..
దేశం పై జరిగిన దాడినా ?
దేహం పై జరిగిన దాడినా ?
మణిపూర్ నడి వీధుల్లో
నగ్నంగా నడిచింది దేహం కాదు..
అవని పై అతి పెద్ద ప్రజాస్వామిక దేశం..
పాశవిక అత్యాచారం జరిగింది
ఓ అభాగ్యురాలి మానం మీద కాదు
మన పాలకుల మౌనం మీద..
జాతులు తెగల మధ్య అగ్గి రాజేసి
ఆ వైరపు కుంపట్ల మాటున దమనకాండ సాగించే
సంఘ విద్రోహ శక్తుల పీచమణచాలి..
తొలి వెలుగు రేఖలు స్పర్శించే
పచ్చని తూర్పు కొండల్లో
తెగల మధ్య సుహృద్భావము పరిఢవిల్లాలి ..