అనంత పయనం | ఫణీంద్ర కుప్పిలి

 

అనంత పయనం | ఫణీంద్ర కుప్పిలి 


జీవితం — ఒక అనంత సముద్రం,

మనం మస్తిష్కపు లోతుల్లో దాచుకున్న

ఆశలు, నిరాశలు అలల వలె ఎగసిపడతాయి.

కొన్ని కలలు తీరం తాకి 

దివిలోని నక్షత్రాల్లా వెలుగుతాయి,

మరికొన్ని లోతుల్లో మౌనమై నిట్టూర్పుగా 

శూన్యంలో కరుగుతాయి..


కానీ అలల ప్రవాహం ఎన్నటికీ ఆగదు—

నిత్య సత్యంలా తీరం వైపు నిరంతరం పయనిస్తుంది.

ప్రతి తరంగం ఒక కొత్త ఆశను మోస్తుంది, 

స్వేచ్ఛను శ్వాసిస్తుంది,

ప్రతి వెనుకడుగు ఒక శాశ్వత పాఠాన్ని దాచుకుంటుంది.. 

రేపటి పయనానికి దారి చూపిస్తుంది.



మనసు — ఓ ఏకాంత నావికుడు, 

ఓర్పుతో ప్రయాణం సాగించే వాడు,

అవగాహన మసకబారిన చోట, 

దిక్కు తెలియని చీకటి వేళ

విశ్వాసమే దిశగా మారుతుంది, 

నక్షత్రమై దారి చూపుతుంది.


తుఫానులు విరిగినా, గాలులు నిశ్చలమైనా,

అలలపై నమ్మకం ఎప్పటికీ మసలదు, 

గమ్యంపై ఆశ వదలదు..

కొన్ని ఆశలు ముత్యాల్లా కాలానికి వెలుగునిస్తాయి జ్ఞాపకాలుగా మిగులుతాయి,

కొన్ని నురుగులా క్షణాల్లో చెరిగిపోతాయి, లేకుంటేనేమి, వెనుక మరొకటి ఉద్భవిస్తాయి.

అయినా సముద్రం శాశ్వత శ్వాసగా నిలుస్తుంది..


ప్రకృతి లిఖించిన అక్షరం అది..

ప్రతి అలలో ఒక ఆరంభం, అనుభవాల సుగంధం,

ప్రతి లోతులో ఒక అనంత రహస్యం, 

ప్రశ్నించని మౌనం,

ప్రతి నిశ్శబ్దంలో ఒక విశ్వ గీతం దాగి ఉంటుంది,

మనసు లయలో అది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.


30.09.2025

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

మొబైలోపాఖ్యానం

(అ)పుత్రస్య గతిర్నాస్తి..