చీకటి వెలుగును చూసి ఫక్కున నవ్వింది... కనిపించేదంతా నిజం కాదు... మెరిసేదంతా బంగారం కాదు అని.. వెలుగు ప్రశాంతంగా బదులిచ్చింది.. కనిపించనిదంతా మాయ కాదు.. నిజం కనిపించాల్సిన అవసరమే లేదు అని.. -ఫణీంద్ర కుప్పిలి 18.07.2026
Posts
వర్షం-3 | ఫణింద్ర కుప్పిలి
- Get link
- X
- Other Apps
వ ర్షం-3 | ఫణింద్ర కుప్పిలి ఈసారి ఆకాశం మొఖం చాటేసింది దిక్కులేని రైతుపై పగబట్టి అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు మబ్బు ముసుగేసుకుంది మొండిగా.. "అలక మాని కురవవా..." అని కళ్లలో ఆశలు ఇంకిపోతుంటే అర్థిస్తున్నాడు రైతు.. దూరాన మెరుపు మెరిస్తే గుండె చిగురిస్తుంది దగ్గరయ్యేలోగా గాలి మాట విని మబ్బు వేరే దారి పడుతుంది.. నేలతల్లి పెదవులు దాహంతో పగుళ్లు బారగా పొలం గుండె ఒక్క స్పర్శ కోసం మౌనంగా తపిస్తోంది. ఆకాశం మాత్రం చినుకుకు బదులు నిర్దయగా తన ప్రకోపాన్ని చూపిస్తోంది.. విత్తనం నేల ఒడిలో జీవచ్ఛవంలా నిద్రిస్తూ చినుకు పిలుపు కోసం ఎదురుచూస్తుంటే.. రైతు గుండె అనునిత్యం ఆశ-నిరాశల నడుమ ఊపిరాడక కొట్టుకుంటోంది.. 28.07.2026
వర్షం -2 | ఫణీంద్ర కుప్పిలి
- Get link
- X
- Other Apps
వర్షం -2 | ఫణీంద్ర కుప్పిలి వర్షం నెమ్మదిగా చిన్న తుంపర్లుగా మొదలైంది.. అత్తవారింటిలో అడుగుపెట్టిన కొత్త పెళ్ళికూతురిలా.. అప్పటి వరకు చుక్క నీటికోసం అలమటించి నెర్రెలు బారిన నేల తల్లి మెల్లగా గుటకలు వేస్తోంది.. వర్షపు జల్లుతో పులకరించిన నేల కమ్మని మట్టి వాసన వెదజల్లుతోంది.. బామ్మ చేసిన చిక్కని ఫిల్టర్ కాఫీ కమ్మదనంలా మనసుని పరవశింపజేస్తోంది.. అంతలోనే... చిరు గాలికి చెట్ల కొమ్మలు ఊగాయి తల్లి ఒడిలో నిద్రపోతున్న బిడ్డను జోలపాడి ఓదార్చినట్లుగా... ఆకుల చివర వేలాడే నీటి బిందువులు కన్నీటి ముత్యాల్లా మెరిసాయి వేదనను వెలుగుగా మలచే ప్రకృతి తత్వాన్ని నేర్పాయి... 05.07.2026
వర్షం | ఫణీంద్ర కుప్పిలి
- Get link
- X
- Other Apps
వర్షం | ఫణీంద్ర కుప్పిలి వర్షం నెమ్మదిగా మొదలైంది.. చిన్న తుంపర్లుగా పడుతోంది.. గుండెలోని బాధ తన్నుకొస్తుంటే జాలువారే కన్నీళ్ళు లాగా.. శ్రమజీవి చెమట చుక్కలు ఆవిరై తిరిగి అవని మీద కురుస్తున్నట్లుగా.. వర్షం జోరు అందుకుంది మనం పుడమి తల్లిపై చేస్తున్న అకృత్యాలను చూసి గుండెలవిసేలా ఏడుస్తున్నట్టు భోరుమని వర్షం కురుస్తోంది.. మధ్య మధ్యలో వెక్కిళ్లు పెడుతున్నట్లు ఉరుములతో ఉక్కిరిబిక్కిరవుతోంది.. గుండెలోని బాధ తీరిన తర్వాత అలసి సొలసి సొమ్మగిల్లినట్లు మేఘం మూతి ముడుచుకుని కూర్చుంది.. అప్పటి వరకు గర్జించిన ఆకాశం విషాదం నుండి కోలుకున్న మనిషిలా ఇపుడు నిర్మలంగా ఆహ్లాదంగా కనిపిస్తోంది తనలోని భిన్న పార్శ్వాలను చూపిస్తూ హరివిల్లుతో కనువిందు చేస్తోంది.. 21.06.2026
సముద్రం-2| ఫణీంద్ర కుప్పిలి
- Get link
- X
- Other Apps
సముద్రం.. | ఫణీంద్ర కుప్పిలి వెండి వెన్నెల వేళ.. అల్లరి చందమామతో సయ్యాటలాడుతూ ఎంతో సొగసుగా ఊసులెన్నో చెబుతుంది! ప్రేమికుల శ్వాసల్లోని వెచ్చదనాన్ని.. తన పైరగాలిలో వెదజల్లుతూ మనసులను గమ్మత్తుగా కట్టిపడేస్తుంది! సమస్త జీవకోటినీ.. అంతులేని రహస్యాల్ని తన అగాధ గర్భంలో దాచుకుని.. పైకి మాత్రం నిష్కామ యోగిలా ఎంతో గంభీరంగా కనిపిస్తుంది! కానీ.. దాన్ని అలుసుగా తీసుకుని మానవుడు గీత దాటిన మరుక్షణం.. రాకాసి అలలతో అమాంతం విరుచుకుపడుతుంది! తనతో తలపడిన ప్రతీ శక్తినీ తన ప్రవాహంలో కలిపేసుకుంటుంది! అప్పటిదాకా జోలపాడిన అలలతోనే క్షణంలో మృత్యురాగం ఆలపిస్తుంది! 07.06.2026
గాయపరిచే వెలుగు | ఫణీంద్ర కుప్పిలి
- Get link
- X
- Other Apps
గాయపరిచే వెలుగు | ఫణీంద్ర కుప్పిలి అబద్ధాల అలలు ఎంత ఎగసిపడ్డా సత్యం సముద్రంలా నిశ్చలంగా నిలుస్తుంది.. మేఘాలు సూర్యుణ్ని కప్పినంత మాత్రాన వెలుగు తన ఉనికిని కోల్పోదు.. కాలం కొన్నిసార్లు అసత్యానికి విజయ కిరీటాన్ని తొడిగినా.. చరిత్ర చివరికి సత్యానికే జయధ్వజాన్ని ఎగురవేస్తుంది.. మాయ మాటల మైకంలో మనసు క్షణకాలం మురిసిపోవచ్చు.. కానీ గాయపరిచే నిజం మాత్రమే నిదురిస్తున్న ఆత్మను మేల్కొలుపుతుంది.. 30.05.2026
సముద్రం | ఫణీంద్ర కుప్పిలి
- Get link
- X
- Other Apps
సముద్రం | ఫణీంద్ర కుప్పిలి పడి లేస్తూ.. లేచి పడుతూ.. తీరాన్ని తాకాలన్న ఏకైక తపనతో అలుపెరుగని కాల గమనంలా, ఫలాపేక్ష లేని నిష్కామ యోగిలా.. నిరంతరం, నిర్విరామంగా తనను తాను పునర్నిర్మించుకుంటూనే ఉంటుంది.. మనిషీ కాలం విసిరే గాయాల రాళ్ళను అనుభవాల ముత్యాలుగా మార్చుకుంటూ.. అవమానాల సుడిగుండాల నుండి ఆత్మగౌరవ తీరానికి చేరాలని నిత్యం తపిస్తాడు.. ఎందరో వదిలివెళ్ళిన స్మృతుల శిథిలాలను హృదయ గర్భంలో నిశ్శబ్దంగా దాచుకుని, ఉపరితలంపై మాత్రం అనంత ప్రశాంతతను నటిస్తాడు. ఎన్ని తుఫానులు విరుచుకుపడ్డా, ఎన్ని తీరాలు దూరమై వెక్కిరించినా.. అతడు ఆగడు, ఆగలేడు.. సముద్రానికి తరంగమేదో.. మనిషికి చైతన్యమది.. ప్రయాణమే తన స్వభావమని, పోరాటమే తన ఉనికికి పరమార్థమని.. సముద్రపు లోతుల్లో దాగున్న మౌనానికి తెలిసినట్టే, మనిషి ఆత్మకూ తెలుసు.. 28.05.2026