(అ)నాగరికత.. | ఫణీంద్ర కుప్పిలి

(అ)నాగరికత.. | ఫణీంద్ర కుప్పిలి


         మా స్కూల్ కి చాలా దూర గ్రామాల నుండి పిల్లలు వస్తుండటంతో..  నేను హాజరు మరియు టైం విషయం లో మరీ అంత కఠినంగా వ్యవరించే వాడిని కాను.. అదీ కాక ఆ ఊళ్లో చాలామంది తమ పిల్లల్ని ముసలి తల్లిదండ్రులు లేదా అత్తమామలు వద్ద వదిలి..పనికోసం దేశం వెళ్ళేవాళ్ళు.. దాంతో పిల్లల ఆలనా పాలనా సరిగా చూసే వారుండకపోవడంతో.. క్రమశిక్షణ విషయంలో కొంత ఇబ్బంది ఉండేది..


నేను క్లాస్ టీచర్ గా ఉన్న తరగతిలో ఒకమ్మాయి రోజూ లేట్ గా వస్తుండేది.. మాములుగా అయితే నేను పెద్దగా పట్టించుకునే వాణ్ణి కాదు గానీ.. ఆ అమ్మాయి హోమ్ వర్క్స్ కూడా సరిగా చేయకపోవడంతో.. ఒకసారి ఆ అమ్మాయిని నిల్చోబెట్టి.. ఎందుకు రోజూ క్లాస్ కి లేట్ గా వస్తున్నావ్? పైగా హోమ్ వర్క్ కూడా చేయటం లేదు  అని గట్టిగా అడిగా..


దానికి ఆ అమ్మాయి ఏమి సమాధానం చెప్పకుండా కామ్ గా నిల్చుని ఉంది.. నేను సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో వాళ్ళ కుటుంబ పరిస్థితులు గురించి వాకబు చేయటం అలవాటు.. అందువల్ల ఆ అమ్మాయిని  మీ అమ్మా నాన్నలు ఎక్కడుంటారు? అని అడిగా.. దానికి సమాధానంగా ఆ అమ్మాయి.. 'మా నాన్న.. లేడండీ..' అంటూ ఆగిపోయింది..
నేను.. దేశం వెళ్లాడా? అని అడిగా..


'లేదండీ.. నా చిన్నప్పుడే చనిపోయాడు అండీ..' అని మెల్లగా చెప్పింది.. నేను వెంటనే.. ' సారీ.. తెలియక అడిగా.. బాధపడకు..'  అని అంటూ.. 'మరి మీ అమ్మ??..' అని అడిగా.. దానికి ఆ అమ్మాయి కళ్ళంట నీళ్లు త్రిప్పుకుంటూ.. నిల్చుంది.. మీ అమ్మ కూడా.. అని అనబోయి.. ఠక్కున ఆగిపోయా.. ఆ అమ్మాయిని మరింత బాధపెట్టటం ఇష్టం లేక..  సరే కూర్చో.. బాధపడకు..ఈరోజు నుండి స్కూల్లో నే ఖాళీ సమయంలో హోమ్ వర్క్ చేసేయ్.. అని సముదాయించి లెక్క చెప్పడానికి బోర్డ్ వైపు తిరిగా..


ఏదో మెకానికల్ గా లెక్క చేసుకుంటూ పోతున్నానే గానీ..  నా మనసు చాలా భారంగా ఉంది.. అసలింతకీ వాళ్ళ అమ్మ ఏమైంది? తనుకూడా చనిపోయిందా? అని నా మనసు పరిపరి విధాలా పోతోంది.. మొత్తానికి ఎలాగోలా క్లాస్ ముగించేసా..
ఆ విషయం గురించి వేరే పిల్లల్ని అడగటం బాగుండదని ఊరుకున్నా.. మాములుగా ఎన్ని బాధలు ఉన్నా.. ఎంత కష్టంలో ఉన్నాకుడా.. నవ్వుతూ.. నవ్విస్తూ పోవటం నాకు అలవాటు.. ఇక లంచ్ అయితే..ఓ చిన్నపాటి పిక్నిక్ లా ఉండేది.. మరీ ముఖ్యంగా.. మా గ్యాంగ్ కలిస్తే.. మినీ జబర్దస్త్ లా ఉండేది.. కానీ ఆరోజు మాత్రం నేను చాలా మొక్కుబడిగా తిని లేచాను.. మా వాళ్ళందరూ.. .. నేను ఎందుకు అలా ఉన్నానో అర్థం కాక తలలు పట్టుకున్నారు..


అలా రోజులు దొర్లుతూ ఉన్నాయి.. ఆ అమ్మాయి ఎపుడూ డిప్రెషన్ లో ఉన్నట్లు ఉండేది.. నేను మెల్లగా ఆమెను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం  చేస్తుండేవాడిని.. దాంతో ఆమెలో కొంత మార్పు కనబడసాగింది.. మునుపటి కంటే ఉత్సాహంగా స్కూల్ కి వచ్చేది.. ఆయితే.. ఆ అమ్మాయి ఎందుకు లేటుగా క్లాస్ కి వస్తుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగితే.... తానొక్కత్తే వండుకుని తిని.. వాళ్ళింట్లో ఒంటరిగా ఉంటుందని.. మాత్రం చెప్పారు..నేను కూడా అంతకు మించి అడగదల్చుకోలేదు.. అదే తరగతిలో రమేష్ అనే ఒక కుర్రోడు ఉండేవాడు.. నేను ఈ బ్యాచ్ కి రెండు తరగతులు చెప్పకపోవడంతో.. పిల్లల గురించి నాకు పెద్దగా అవగాహన లేదు.. కానీ ఈ పిల్లోడు బాగా ఆకతాయతనం వలన ఒకటి రెండు సార్లు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు చూసా.. నా తరగతిలో కూడా పెద్దగా ధ్యాస పెట్టేవాడు..ఏ హోమ్ వర్క్స్ చేసేవాడు కాదు.. చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు..


కానీ ఒకరోజు క్లాస్ లో నేను ఏదో ఒక లాజికల్ క్వశ్చన్ అడిగినప్పుడు.. క్లాస్ లో ఎవరు స్పందించలేదు.. క్లాస్ లో టాపర్స్ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు.. ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ.. రమేష్ నిల్చుని.. దానికి ఆన్సర్ ఠక్కున చెప్పాడు.. వాడి చదువు గురించి తెలిసిన మిగతా పిల్లలు ఘొల్లున నవ్వారు.. దాంతో మనోడు మొఖం వేలాడేశాడు.. అయితే ఆశ్చర్యం ఏంటంటే.. రమేష్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు.. అపుడు నేను.. రమేష్ చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అని చెప్పటమే కాకుండా.. అందరితో క్లాస్ కొట్టిపించా..


క్లాస్ అయిన తర్వాత రమేష్ ని పిలిచి.. ఇంత తెలివితేటలు ఉన్నోడివి.. మరెందుకు సరిగ్గా చదవటం లేదు అని అడిగా? ఎప్పటిలాగే నాప్రశ్నకి సమాధానం చెప్పకుండా.. ఎటో చూసుకుంటున్నాడు.. నాకు కోపం వచ్చి.. ' రేపు స్కూల్ కి.. మీ నాన్నని తీసుకుని రా..' అని చెప్పాను.. దానికి వాడు అదో రకమైన నవ్వు నవ్వి..  '..అది చాలా కష్టం సార్ ' అని అన్నాడు.. బహుశా పనికి దేశం వెళ్ళాడేమో అనుకుని ..పోనీ.. మీ అమ్మని తీసుకురా అని అన్నా.. దానికి వాడు.. ' మా అమ్మ బడి పెట్టక ముందే.. కూలి పనికి టౌను వెళ్ళిపోయి.. వచ్చేసరికి రాత్రి అయిపోతుంది సర్..' అని చెప్పాడు..


దాంతో నాకేమనాలో అర్థం కాక.. సరే.. మరి నువ్వు హోమ్ వర్క్స్ సరిగా చేయవు.. స్కూల్ కి టైము కి రావు.. అని ఆడిగేసరికి... మనోడు కళ్ళంట నీళ్లు త్రిప్పుకుని..  ' మా అమ్మ రోజంతా కష్టపడి వస్తుంది సార్.. మా చెల్లి చిన్నది.. అందువలన నేనే మా అమ్మ వచ్చేసరికి నీళ్లు తెచ్చి.. సామాన్లు తోమి.. అగ్గి ఎలిగించి పొయ్యి మీద ఎసరు పెడతాను సార్.. అందువల్ల వర్కులు సెయ్యడానికి నాకు టైముండదు..' అని గుక్కత్రిప్పుకోకుండా చెప్పేసాడు.. మరి మీ నాన్న.. అని అడగబోయి.. తల్లిదండ్రులు లేని బాధను అనుభవించిన వాడిన అవ్వటం వలన మళ్లీ ఎందుకు చిన్న పిల్లోడిని బాధపెట్టటం అని ఆగిపోయా..


ఇక అప్పటి నుండి రమేష్ నాతో బాగా క్లోజ్ అయ్యాడు.. ఎపుడు నాకు ఖాళీ ఉన్నా.. నా దగ్గరికి వచ్చేసేవాడు.. లెక్కలతో పాటు.. అనేక విషయాల్ని చెప్పేవాడిని.. మెల్లగా మా మధ్య మంచి బంధం ఏర్పడింది.. నేను చాలా సార్లు వాళ్ళ నాన్న గురించి అడుగుదామనుకుని.. అడగలేకపోయా.. మనోడు మెల్లగా చదువులోనూ.. ఆటల్లోనూ రాణించసాగాడు.. మునుపటి కంటే చాలా ఉత్సాహంగా కనిపించసాగాడు..ఇలా కాలం గడుస్తూ ఉంది..


ఒకరోజు సాయంత్రం గేమ్స్ పీరియడ్ లో పిల్లలంతా ఆటల్లో మునిగిపోయారు.. మా కొలీగ్స్ సైతం చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి గాసిప్స్ తో బిజీ గా ఉన్నారు.. నేను మాత్రం ఓ చెట్టుకింద కూర్చుని.. మొబైల్ చూస్కుంటున్నా.. ఇంతలో ఎక్కడినుండి వచ్చాడో గానీ.. సార్.. అని సడెన్ గా పిలిచేసరికి.. ఈలోకంలోకి వచ్చిపడ్డా..


 ఏంట్రా రమేష్..నువ్వు ఆడుకోవడం లేదా?? నువ్వు అసలు బడికి వచ్చేదే ఆట కోసం కదరా.. అని నవ్వుతూ అన్నా.. దానికి మనోడు.. కొంచెం ఫీల్ అయి.. '..ఈమధ్య నేను క్లాస్ లోనే ఉంటున్న కదా సర్.. ' అంటూ..ఇంకా ఏదో చెప్పబోయి.. ఆగాడు.. సర్లేరా.. ఏదో సరదాగా అన్నా.. ఇంకేంటి సంగతి.. అని అడిగా..


దానికి రమేష్.. ' సార్.. మీరు శానా రోజుల నుండి మా నాన్న గురించి అడగాలనుకుని.. అడగలేకుండా ఉన్నారు కదా సర్..' అని అన్నాడు.. దానికి ఉలిక్కి పడి..అబ్బే.. అదేం లేదురా.. అని టాపిక్ మార్చే ప్రయత్నం చేశా.. కానీ వాడు మాత్రం చెప్పుకుంటూ పోసాగాడు..

'సర్..మీరనుకుంటున్నట్లు.. మా నాన్న చనిపోలేదు సార్..' మరీ.. మీ అమ్మని...? అని ఆగా… దానికి రమేష్ ఒకింత బాధపడుతూ.. తలదించుకుని.. లేదు సర్.. మమ్మల్ని వదిలేసి.. వేరే ఆవిణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు సర్.. అని కన్నీళ్లపర్యంతమయ్యాడు..


ఉఫ్.. ఇదేమీ బాధరా భగవంతుడా..ఈ చిన్న పిల్లాడు పరిస్థితేంటి అని ఆ బాధ నుండి తేరుకునేలోగా.... ' మా నాన్న తీసుకెళ్లిపోయింది..ఎవరినో కాదు సర్.. ఆరోజు మీరు క్లాసులో అడిగిన ఆ అమ్మయి వాళ్ళ అమ్మనే సర్..' అంటూ.. మరో బాంబుని పేల్చి పారిపోయాడు..


12.11.2018

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం