2050 లో... | ఫణీంద్ర కుప్పిలి


2050 లో... | ఫణీంద్ర కుప్పిలి.

               నేను హడావుడిగా నా పాత టూవీలర్ ని తీయబోతుంటే ఒక వ్యక్తి నా దగ్గరకొచ్చి పలకరించాడు. నేనసలే మతిమరుపు మనిషిని అవ్వడం వలన కొంత మొహమాటంగానే ఒక ప్లాస్టిక్ నవ్వు విసిరి పలకరించా గానీ లోలోపల ఎవరా అన తెగ గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తున్నా..

              నా మతిమరుపు గురించి బాగా తెలిసిన మనిషి అవ్వడం వలన నా ఇబ్బంది ని గమనించి తనే మా మధ్య గల మిత్రత్వాన్ని గుర్తుచేశాడు..అప్పటికి నేను తేరుకుని  పూర్తిగా ఈలోకం లోకి వచ్చాను. సుమారు పాతిక ముప్పై ఏళ్ల కిందటి ఫ్లాష్ బ్యాక్ లోని ఇషయాలన్నీ ఒక్కొక్కటిగా నా కళ్ల ముందు కనపడసాగాయి.

             మేము ఆ రోజుల్లో గ్రూప్స్ కోసం కలిసి ప్రిపేర్ అయ్యేవాళ్లం. అలాగే 2011 గ్రూప్-1 నోటిఫికేషన్ లో ఇంటర్వ్యూ వరకూ వెళ్ళి కోర్ట్ గొడవల వలన రిజల్ట్స్ లేక తిరిగి పరీక్షలు లేక ఏళ్లు పూళ్లు గడిచిపోయాయి. ఇపుడు మళ్లీ ఒక మూడు దశాబ్ధాల తర్వాత మా మిత్రుడు కలవడం తో మేము వాట్సాప్ లూ, ఫేసు బుక్కులూ కొత్తగా వచ్చిన ఆ రోజుల్లో ఎలా ఎడా ఫెడా రేత్రి పగలనక  తెగ చాటింగ్ లు చేసుకునోళ్లమో గుర్తుజేస్కున్నా..

             కొన్నాళ్లకి నా మిత్రుడు సడెన్ గా మాయమయిపోయాడు. బహుశా ఆ నెంబరుంటే ఇక తన బతుకు ఇశాఖపట్నం బస్టాండే అని అనుకున్నడో ఏమో గాని నెంబరు మార్చేసి కనిపించకుండా పోయాడు. ఇదిగో ఇన్నాళ్లకి మళ్ళీ ఇలా సడెన్ గా ప్రత్యక్షమయ్యాడు. 

             ఇలా ఫ్లాష్ బ్యాక్ లో కెళ్లిన నేను.. 'ఫణీ' అని ఒక్క పిలుపుతో మళ్లీ ఈలోకం లోకి వచ్చి పడ్డాను మా మిత్రుడు నన్ను " ఏంటి చేస్తున్నావ్? నువ్ నీ పాత ఉద్యోగం లోనే ఉన్నావా?? రిటైర్మెంట్ ఎపుడు? " అని వరుస ప్రశ్నల తో ఊపిరి సలపకుండా చేశాడు. నేను దానికి ఈ ఆగష్టు నెలాఖరుకి నా రిటైర్మెంట్ అని ముక్త సరిగా సమాధానమిచ్చా. కానీ మా మిత్రుడు అంతటితో వదలకుండా..

              ఓహ్ నీ రిటైర్మెంట్ పనులు లో బిజీ గా ఉన్నట్లున్నావు అని తనే అంటూ.. మళ్లీ "మీ పిల్లలు ఏంటి చేస్తున్నారు?? నువ్ మళ్లీ గ్రూప్సు రాసి ఉద్యోగం సాధించావా?? అని వరుస ప్రశ్నలు సంధించాడు?? " ఇక అసలు విషయం చెప్తేగానీ మావాడు ఇడిసి పెట్టేలా లేడని నా గురించి చెప్పడం మొదలుపెట్టా..

              ఆ 2011 గ్రూప్-1 కేసు ఇంకా తేలలేదనీ.. ఆ ఇషయం మీదే నేను ఇంకా బిజీ గా తిరుగుతున్నానని  నా మిత్రుని తో చెప్పా..మా వాడు ఒకింత ఆశ్చర్యంగా నావైపు చూడసాగాడు..   కానీ నేను అదేమి పట్టించుకోకుండా చెప్పుకుంటూ పోసాగాను.

              ఏంటంటే '..ఈనెలఖరుకి కోర్ట్ తీర్పు అనుకూలంగా వస్తుందని.. మనకు పోస్టింగ్స్ వస్తాయని.. అలాగే ప్రభుత్వం వయోపరిమితి  60 ఏళ్లకి పెంచడం తో సివరాఖరి సారిగా మొన్ననే మా సిన్నోడితో కలిసి గ్రూప్-1 మెయింస్ రాశానని..' గుక్కతిప్పుకోకుండా బాలయ్య బాబులా చెప్పడంతో.. నా మిత్రుడు రోడ్డు పైనే కళ్లు తిరిగి పడిపోయినంత పనిచేశాడు. నేను గభాల్న మావాడి చేయి పట్టుకోడంతో పేద్ధ ప్రమాదమే తప్పింది.. ఇందులో నామిత్రుడి తప్పేమి లేదు... నేను చెప్పిన విషయం  అలాంటిది మరి.

              మా వాడ్ని నేనడిగా ' ఇంతకీ నువ్వేం చేస్తున్నావురా' అని? దానికి మా వాడు ఒకింత చిద్విలాసంగా నవ్వుతూ..  ' నాదేముంది రా.. మన కేసు ఐదేళ్లు జీడిపాకంలా సాగి.. దేశం లోని అన్ని కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి.. శివరాఖరికి విక్రమార్కుడి కథ లోని భేతాలుడిలా మళ్ళీ చెట్టెక్కి కూర్సునే సరికి నాకు బాగా జ్న్యానోదయం అవడంతో.. మన  కమీషన్ల మీద, కోర్టుల మీద అపారనమ్మకంతో.. ఒక చిన్న కోచింగ్ దుఖాణం పెట్టుకున్నా మిత్రమా' అని ఠాగూర్ సినిమాలో చిరంజీవిలా.. గడ గడా చెప్పేసాడు. అక్కడితో ఆగకుండా... ' ఇపుడు ఓ బెమ్మాండంగా 'మూడు  నోటిఫికేషన్లు ఆరు రీ ఎగ్జామ్ల తో ఝాం ఝాం గా నడిపించేత్తున్నా' అని చెప్పడం తో ఈసారి కళ్లు తిరగడం గాదు ఫిట్స్ వచ్చినోడిలా గిల గిల కొట్టుకుని పడిపోడం నా వంతయింది....


( కమీషన్ల నిర్లక్ష్య వైఖరి తో తీవ్రమైన నిర్వేదనకు గురౌతున్న గ్రూప్-1 అభ్యర్థుల గాధ )

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం