యుద్ధోన్మాదం | ఫణీంద్ర కుప్పిలి

 


యుద్ధోన్మాదం | ఫణీంద్ర కుప్పిలి

అర్ధరాత్రి వేళ..
హాయిగా అమ్మ ఒడిలో  నిద్రిస్తున్న చిన్నారి
తల హఠాత్తుగా తెగి పడి మొండెం మిగిలింది..
తన భవిష్యత్తు కోసం కలలు కంటూ
పడుకున్న ఒక యువకుని రేపటి కల చెదిరింది..
మరో చిన్నారి తన కళ్ళముందే
కన్న వాళ్ళని కోల్పోయి దిక్కులేనిదయింది..
తన అవశాన దశలో అక్కరకొస్తాడనుకున్న కొడుకు అచేతనంగా పడి ఉండటం చూసి..
ఓ తల్లి మౌనంగా కుమిలిపోతోంది..

ఎటు చూసినా శవాల గుట్టలు..
తెగిపడిన శరీర అవయవాలు..
కూలిన భవనాలు..
వెక్కిరిస్తున్న మొండి గోడలు..

చెవులు చిల్లులు పడేలా మోగుతున్న ఫిరంగి గుళ్ళు..
బాంబుల వర్షం కురిపిస్తున్న శత్రు దేశ లోహ విహంగాలు.
పరాయి దేశ రాబందులు రెక్కల చప్పుళ్ళు..

ఎటు చూసినా భీభత్సం..
ఎటు చూసినా భయానకం..
ఎటు చూసినా అంతులేని మారణ హోమం..
యుద్ధోన్మాదుల వికృత వికట్టహాసం..

పొరుగు దేశ దాష్టీకాలు..
అగ్ర నాయకుల అభిజాత్యాలు..
చేష్టలుడిగి చూస్తున్న ప్రపంచ దేశాలు..

అమాయక ప్రజల రేపటి ఆశల పీక నులిమేస్తూ
నూతన సహస్రాబ్దిలో మరో రక్త పద చిత్రం..

యుద్ధంలో విజేతలుండరు..
మానవత్వాన్ని మంటగలిపిన
చరిత్ర హీనులు మాత్రమే ఉంటారు..
మరోమారు రక్త చారికలు నిండిన చరిత్ర
మౌనంగా రోదిస్తూ మిగులుతుంది..

30.03.2022

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం