నేనో పెద్ద హిపోక్రాట్ ని

నేనో పెద్ద హిపోక్రాట్ ని | ఫణీంద్ర కుప్పిలి

జీవితం సాఫీగా సాగినంత కాలం
నేనొక నాస్తికవాదిని..

సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు
అన్నింటిలోనూ శ్రీహరిని దర్శించే అపర ప్రహ్లాదుడిని..

సమస్య వేరొకరిది అయితే
నేనొక అభ్యుదయ వాదిని..

అదే సమస్య నా నట్టింట్లోనిదయితే
నేనొక కరడుగట్టిన సంప్రదాయవాదిని...

స్టేజీ మీద ప్రసంగించేటపుడు నేనొక స్త్రీవాదిని..
నాభార్య బిడ్డల దగ్గర నేనొక పురుషహంకారిని..

ఇతరులకి నీతులు చెప్పేటపుడు నేనొక మానవతావాదిని..
నా తల్లిదండ్రుల్ని వదిలించుకోడానికి
కుంటి సాకులజెప్పే దుర్మార్గుడిని..

ముఖపుస్తకంలో కులరహిత సమాజం కోసం
తెగ పోస్టులు పెట్టే అంబేద్కర్ వాదిని..
ఎన్నికలపుడు తన కులపువాడికి మాత్రమే
ఓటేసే సగటు ఓటర్ని..

ఫొటోలకి ఫోజులిచ్చేటప్పుడు
నేనొక పర్యావరణవాదిని..
ఇంటి ఎలివేషన్ కి ఓ చెట్టు అడ్డొచ్చినపుడు
నేనొక అరాచకవాదిని..

ఒక్కమాటలో చెప్పాలంటే..

జీవితంలో అనుక్షణం విరుద్ధ భావాల
ఒరిపిడిలో...
హాయిగా బ్రతికేస్తున్న ఓ పెద్ద హిపోక్రాట్ ని...


  

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం