అంతులేని వ్యధ-1

అంతులేని వ్యధ-1 || ఫణీంద్ర కుప్పిలి

             మా చుట్టుపక్కల ఓ పది,పదిహేను గ్రామాల్లో వెటరినరీ డాక్టర్ గా మా నాన్న గారికి మంచి పేరుండేది.. ఎప్పుడు ఎవరొచ్చి తలుపుతట్టినా.. క్షణమైన ఆలస్యం  చేయకుండా వెంటనే బయలుదేరి వెళ్ళిపోయేవారు..ఆ విధంగా ఎపుడూ వచ్చీ పోయే జనాలతో కళకళ లాడే ఇళ్ళు...హఠాత్తుగా నాన్న పోవడంతో కల తప్పింది..అప్పటికే  తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మ...నాన్న పోయిన దిగులుతో పూర్తిగా మంచాన పట్టింది..ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా..నాన్న పోయిన షాక్ నుండి అమ్మ తేరుకోలేక పోయింది.. చివరికి నన్ను ఒంటరి వాడిని చేసి నాన్న దగ్గరకే చేరుకుంది.. కేవలం ఒక సంవత్సరం వ్యవధిలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడంతో ఒక్కసారిగా నా జీవితంలో శూన్యం ఏర్పడింది..నా చెల్లెలు, బావా నైతికంగా నాకు పూర్తి మద్దతిచ్చినప్పటికీ.. తల్లిదండ్రులు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది..

             అప్పటికే పెళ్ళి జరిగిపోయి, ఒక కుటుంబం ఉండుంటే.. కొంత వరకూ ఆ బాధని దిగమింగుకోగలిగే వాడినేమో..కానీ హఠాత్తుగా అమ్మా నాన్నలిద్దరూ చనిపోవడంతో నేను వెంటనే వివాహం చేసుకోలేకపోయా...దాంతో ఎపుడూ సందడిగా ఉండే ఆ ఇంట్లో నేను ఒక్కడినే.. ఒంటరిగా ఉండలేకపోయా..ఆ ఇంట్లో ఎటు చూసినా అమ్మానాన్నలకి సంబంధించిన ఏదో ఒక జ్ఞాపకం నన్ను వెంటాడేది.. అయినా కూడా ఉద్యోగరీత్యా ఆ ఊళ్ళోనే ఉండాల్సి వచ్చింది..పైగా ఆ ఊరితో..ఆ ఇంటితో నా జీవితం ఎంతగానో పెనవేసుకుపోయింది.. అందువలన ఆ ఇంటిని, ఆ ఊరి జనాల్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి అనామకుడిగా బ్రతకలేక ఆ ఇంట్లోనే ఉండాలని నిశ్చయించుకున్నా.. ఇటువంటి అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో..ఆ బాధ నుండి బయటపడటం కోసమైనా ఏదన్న పోటీపరీక్షకి ప్రిపేర్ కావాలని నిశ్చయించుకున్నా..

            అన్ని పోటీ పరీక్షలకీ ఉపయోగ పడే జనరల్ స్టడీస్ ని ఓ పక్క నేను ప్రిపేర్ అవూతూనే..నా దగ్గరికి వచ్చే వాళ్ళకీ నాకు తోచిన గైడెన్స్ ఇస్తూ ఉండేవాడిని.. అటువంటి సమయం లోనే గ్రూప్-1 కి నోటిఫికేషన్ వెలువడింది..నేను అంతకు ముందు డీ.యస్సీ లో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సాధించినప్పటికీ.. నాకు పోటీపరీక్షలపై పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు..అయితే నా గురించి బాగా తెలిసిన మిత్రులు..నీ మనస్తత్వానికి ఈ పరీక్షలు బాగా సరిపోతాయి.. ప్రిపేర్ అవమని బలవంత పెట్టసాగారు..దాంతో మా అమ్మ నాన్నల్ని కోల్పోయిన డిప్రెషన్ నుండి బయటపడటం కోసమన్నా చదవాలని నిశ్చయించుకున్నా.. అప్పటి వరకూ నేనెపుడూ గ్రూప్స్ పరీక్షలు రాసుండలేదు..అందువలన నాకు వాటిపై అసలు అవగాహన లేదు..అలాగని ఉన్న ఉద్యోగాన్ని వదిలి హైదరాబాదులో కోచింగ్ తీసుకునే పరిస్థితుల్లో లేనందున.. సొంతంగానే ప్రిపేర్ కావాలని నిశ్చయించుకున్నా..

23.02.2017

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం