వలస కూలోళ్లం.. | ఫణీంద్ర కుప్పిలి

వలస కూలోళ్లం.. | ఫణీంద్ర కుప్పిలి

కడువు చేత పట్టుకొని..
బాధ్యతల్ని భుజాన వేసుకుని..
రెక్కల కష్టాన్ని నమ్ముకుని..
కన్నోళ్లని,ఉన్న ఊరిని వదిలి..
బతుకు బాటలో, మెతుకు వేటలో
జిల్లాలు రాష్ట్రాల సరిహద్దులు దాటి
సాగిపోతూనే ఉంటాం..
మాకు కులం లేదు.. మతం లేదు
భాష లేదు.. ప్రాంతీయ భేదం లేదు
ప్రతి పనిలో మేము..
ప్రతి పనికీ మేమే..

పంట పండక.. చేసిన అప్పుతీరక
ఉన్న ఊళ్లో పనుల్లేక,
వలస వెళ్లే ఓపిక లేక..
పస్తులున్న ముసలి ప్రాణాలకు..
కాస్త గంజి నీళ్లు పోసేందుకు..
డొక్క మాడ్చుకుని
నాలుగు రూకలు మిగుల్చుకుంటాం..
మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు..
కరోనా మహమ్మారి పంజా విసిరి..
ఎక్కడోళ్లనక్కడే లాక్ డౌన్ చేసేస్తే..
కూలి లేదు.. కూడు లేదు..
ఉండేందుకు గూడు లేదు..
ఊరెళ్లడానికి చేతిలో రూక లేదు..

ఖరీదైన బాబులంతా విమానాల్లో
దిలాసాగా సొంత ఇళ్ళకి చేరుకుంటే..
పిల్లా పాపలతో.. నెత్తి మీద మూటలతో
నడుస్తూ..పడుతూ లేస్తూ
పొలిమేర దాటేసరికి సమయమేమో మించిపోయే..
ఊరు, పేరు లేని మాబోటి కూలీలంతా
పొలిమేరల్లోనే లాక్ డౌన్ అయిపోయాం..
ప్రకటనల్లోని సాయం పేపరుకే పరిమితమయితే..
ఉన్నచోట ఉండలేక.. సొంతూరుకి పోలేక..
దిక్కుతోచని స్థితిలో..
సొంత దేశంలోనే శరణార్ధులమయ్యాం..

దేశ నిర్మాణంలో ఆహారహం శ్రమించే
ఉనికిలేని జీవులం..మేమే వలస కూలోళ్లం..
మరోసారి కష్టాలను, కడగండ్లను
మునిపంటిన అదిమ పెట్టి..
ఉన్నచోటే నిలబడి..
ఆకలి దప్పికలతో పాటు
కరోనాపై సమరంలో సైతం
విజయధ్వానాలు చేస్తాం..

16 ఏప్రిల్, 2020.

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

మొబైలోపాఖ్యానం

(అ)పుత్రస్య గతిర్నాస్తి..