రివలేషన్ | ఫణీంద్ర కుప్పిలి

రివలేషన్ | ఫణీంద్ర కుప్పిలి

శ్మశానం అంచున
ప్రాణంతో పడున్న శవం లా..
నిస్తేజంగా, నిర్లిప్తం గా
అనంత శూన్యం లోకి చూస్తూ..

గతం కళ్లల్లో సినిమా రీల్ లా
పరుగులు తీస్తోంది..
నాదైన నిరంకుశ ప్రపంచం..
ఎన్నో ఆర్తనాదాలు, మరెన్నో ఆత్మ ఘోషలూ
శరీరం లో సత్తువ ఉన్నంత కాలం
అంగ,అర్థ బలం తో
నేను జరిపిన దమనకాండ
నేను నిర్దాక్షిణ్యంగా అణచివేసిన మూగ వేదనలూ..

నేనూ నాకుటుంబం అనే మత్తులో
అందరి స్వప్న సౌధాలను కూల్చివేస్తూ
ఆడదాన్ని ఒక బానిసలా చూస్తూ
అందరి కష్టాన్ని దోచుకుని..
నేను నిర్మించుకున్న నా కుటుంబం..
నేడు నన్ను కేవలం..
ఒక ప్రాణమున్న వస్తువు గానే
చూస్తోంది..

రోజంతా కూర్చున్నా
నా భారాన్ని నెత్తికెత్తుకుందని
ఎవరూ ప్రేమతో తల నిమరరు సోఫాని..
సమస్తాన్ని శాసించిన
నీ బుల్లెట్ ని ఎవరూ ముద్దుపెట్టుకోరు
కృతజ్ఞతతో..

ఇందుకోసమేనా నా జీవితాన్ని ధారపోశాను??
ప్రాణముండగా నాలుగు మంచి మాటలు
ప్రాణం పోయాక మోయడానికి
నలుగురు ఆత్మీయులు లేనప్పుడు
ఎంత కూడగట్టుకున్నా..
ఎన్ని మేడలు కట్టుకున్నా ఏమి ప్రయోజనం??

నాలో రగులుతున్న ఆవేదననూ
పశ్చాత్తాప భావననూ
నా ఆత్మ ఘోషనూ
వినిపించాలని ఎంత గొంతుచించుకున్నా..
ఏమి ప్రయోజనం??
స్మశానం అంచున ప్రాణమున్న శవం లా
నేను..

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం