రావణ కాష్ఠం | ఫణీంద్ర కుప్పిలి

రావణ కాష్ఠం | ఫణీంద్ర కుప్పిలి

కళ్లకి కన్నీళ్ళ పువ్వులు పూచాయి..
అవి ఒక్కొక్కటిగా గుండెలోకి జారి
గుండె చెరువయ్యింది...
కళ్లు పొడిబారాయి...

మదమెక్కి మతి తప్పిన ఉగ్రవాద మూకలు
మనుషుల రక్తంతో హోలీ ఆడుతున్నాయి..

చెల్లాచెదురుగా తెగిపడిన మొండేలు..
తుఫాను తాకిడికి నేలకొరిగిన
అరటి బోదెల్ని తలపిస్తున్నాయి..

అల్లారు ముద్దుగా పెంచుకున్న
తమ గారాల పట్టీ..
హఠాత్తుగా మాయమై...
మనుషుల సంతలో
వేలానికి నిలబడింది...

అంతర్యుద్ధం కొలిమిలో
నిత్యం రగులుతున్న రావణ కాష్ఠం...
వసివాడని పాలబుగ్గలపై
నెత్తుటి చారలు గడ్డకట్టిస్తోంది...

వేయి తూటాలకి సమానమైన
ఒమ్రాన్ దక్నీష్ అమాయక చూపులు..
అంతర్యుద్ధపు పాపాలను
చేష్టలుడిగి చూస్తున్న..
యావత్తు ప్రపంచపటాన్ని
ఛిద్రం చేసేలా ఉన్నాయి..

సిరియా అంతర్యుద్ధం..
భూమాత శరీరంపై
నిత్యం రసికారుతున్న రాచపుండు అయితే,
వెంటాడుతున్న ఉగ్రభూతం..
యావత్తు భూగోళాన్ని
కబళిస్తోన్న క్యాన్సరు కణం వంటిది...

19.08.2016

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం