ఆల్జీబ్రా.. గుండె గాభరా


ఆల్జీబ్రా.. గుండె గాభరా...| ఫణీంద్ర కుప్పిలి 
    
సాధారణంగా చాలా మంది పిల్లలకు మేథ్స్ అంటే  భయం..అందుకే 'ఆల్జీబ్రా.. గుండె గాభరా..😀' అనే నానుడి చాలా పాప్యులర్ అయింది..కానీ నాకు మాత్రం.. చచ్చేంత భయం 😀😀.. చాలా మంది ఇంటర్మీడియట్ లో ఆర్ట్స్ లేదా సైన్స్ స్ట్రీమ్స్ ని ఎంచుకోడానికి.. వాటి మీద ఇంట్రెస్ట్ కంటే కూడా..మేథ్స్ అంటే భయమే.. అతి ముఖ్య కారణం..😁😁
                      
              స్కూల్లో ఎపుడూ కూడా నాకు మిగతా సబ్జెక్ట్స్ లో మంచి మార్క్స్ వచ్చినప్పటికీ.. మేథ్స్ దగ్గర దెబ్బ పడేది..' కుంచాలమ్మ కూడదీస్తే.. మంచాలమ్మ మోసుకుపోయింది😀😀..' అన్న చందాన..నేను మిగతా వాటిలో తెచ్చుకున్న లీడ్ ని..ఈ పాపిష్టి సబ్జెక్ట్ నన్ను అమాంతం వెనక్కి నెట్టేసేది.. ఆ లెక్కల చిక్కుల్ని విప్పలేక..ధైర్యం చేసి అర్థం కాని వాటిని క్లాసులో అడగలేక.. బాలీవుడ్ నుండి దిగుమతి అయిన మన తెలుగు హీరోయిన్లు.. ఏ జబర్దస్త్ లాంటి ప్రోగ్రాం కి వచ్చినపుడు.. ఆ తెగులు జోకులు అర్థం కాక.. అలాగని మూతి ముడ్చుకుని కూర్చోలేక..బస్సు తప్పిపోయినపుడు నవ్వే నవ్వుని..మొహాన్ని పులుముకుని కూర్చున్నట్లు🤣.. క్లాసులో బెంచి మీద కాకుండా ముళ్ళు మీద కూర్చున్నట్లు😓..కూర్చునే వాడిని..

               నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే రోజుల్లో.. రోజూ దేవుణ్ణి తలుచుకునే వాడినో లేదో కానీ.. కరెంటోడిని  మాత్రం తలచుకునేవాడిని.. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే..రోజూ కొత్త తిట్లను కనిపెట్టేవాడిని😁 ఎందుకంటే.. రాత్రిళ్ళు..    ఇపుడు టీవీలో..యాడ్ ల మధ్యలో సీరియల్ వచ్చినట్లు.. అపుడపుడూ పవర్ వచ్చేది.. అలాంటి టైములో.. మా లెక్కల సారు.. మా మీద కసి తీర్చుకునేవాడు. మమ్మల్ని అందరినీ ఓచోట కూర్చోబెట్టి..
రోల్ నెంబర్ పిలిచి ఏ పంతొమ్మిదో ఎక్కం చెప్పమనో లేదంటే ఏదో సూత్రాన్ని చెప్పమనో ఆర్డర్ వేసేవారు.. నా నెంబర్ ఎపుడు పిలిచి చావగొడతారో అని బిక్క చచ్చి కూర్చునే వాడిని😥... అదేంటో గానీ ఎంత గుర్తు పెట్టుకుండామని ట్రై చేసినా..ఆ సూత్రాలు గుర్తుండి చచ్చేవి కాదు..

               ఇక ఏ సెలవులకో ఇంటికి వచ్చినపుడు.. తాతయ్య వాళ్ళింటికి వెల్లేవాళ్ళం..అపుడు మధ్యాహ్నం లేదంటే రాత్రుల్లో..అక్కడ మామయ్యాలు.. పెద్దోళ్ళు.. ఎవరికి టైం పాస్ అవ్వకపోయినా.. మామీద చిక్కు లెక్కలతో విరుచుకు పడేవాళ్ళు..😀😀 కొంతమంది మా కజిన్స్.. అదేదో ర్యాపిడ్ రౌండ్ పోటీలగా..యమా స్పీడ్ గా ఆన్సర్లు చెప్పేసేవాళ్ళు.. జనరల్ నాలెడ్జ్ వంటి వాటిలో చాలా షార్ప్ గా ఉండే నేను మళ్ళీ..లెక్కలు దగ్గరకు వచ్చేసరికి చాలా ఇబ్బంది పడేవాడిని.. అలాగే చుట్టూ పక్కల చిన్న పిల్లలు..ఏదన్నా మేథ్స్ ప్రాబ్లెమ్ రాకపోతే నామీదకి దండయాత్ర చేసేవాళ్ళు..అపుడు నేను నానా తిప్పలు పడి.. ఎలాగోలా వాటిని సాల్వ్ చేసి..వాళ్ళను వదిలించుకుని వాడిని..

               కానీ మా ఇంట్లో మేథ్స్ భయం అని అంటే..అదో రకంగా చూస్తారు.. అదేంటో అందరూ కొంచెం బెటర్ గానే ఉంటారు (...అలా అని అంతా లెక్కల్లో.. మహా పండితులని  కాదు లెండి).. కానీ నాకు మాత్రం మేథ్స్ అంటే విపరీతమైన భయం కూడిన గౌరవం వలన పుట్టిన అసహ్యం.. ఆ విషయం బయటకు చెబితే.. ఇక నన్ను ఓ వింత జీవిగా చూస్తారనే భయంతో..' ఇష్టం లేని పెళ్లాంతో కాపురం' చేసినట్లుగా.. ఎలాగోలా పదోతరగతి వరకూ నెట్టుకొచ్చా..ముందు నుండీ బయోలజీ అంటే ఇష్టం తో పాటు..ఈ లెక్కల తలనొప్పిని వదిలించుకోవచ్చు..ఈ దెబ్బకు రెండు పనులు అయిపోతాయని..మా నాన్నకు తెలియకుండా ఇంటర్లో బై.పీ.సీ తీసుకున్నా..

                  '..తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచినట్లు😀' అనుకోని పరిస్థితుల్లో.. '...నిను వీడని నీడను నేనే..' అన్నట్లు.. మళ్ళీ లెక్కలతో సహవాసం చేయవలసి వచ్చింది.. నా దురదృష్టం కొలదీ..  మానాన్న స్నేహిడొకడు సైన్స్ గ్రూప్ తీసుకుని.. మెడిసిన్ లో సీటు రాక.. చివరికి మెడికల్ షాపు పెట్టుకున్నాడు. అతను ఫుల్లుగా క్లాస్ పీకడంతో పాటు..మన తెలివితేటలు 😆గురించి ఆల్రెడీ బాగా తెలిసుండటంతో.. లెక్కల గ్రూప్ తీసుకుంటే ఏదో ఒక ఉద్యోగం అయినా వస్తుంది..లేదంటే కనీసం ట్యూషన్ అయినా చెప్పుకుని బ్రతికేయొచ్చు అనే ముందు(?) చూపుతో.. నన్ను వెనక్కి నెట్టేశారు.. మొత్తానికి..'బొమ్మరిల్లు' సినిమాలో సిద్ధార్థ లాగా..  మా నాన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బి.ఎడ్ చేసి..చివరకు లెక్కలు(రాని)😁 మేష్టార్ ని అయ్యాను..

        మొత్తానికి ఏదోలా  నానా తంటాలు పడీ..సొంతంగా లెక్కల వెనుక గలా లాజిక్ ని అర్థం చేసుకోగలిగా.. ఒక్కసారి ఆ లాజిక్ అర్థమయ్యాక..ఓస్ ఇంత వీజీనా(..మీరు కరెస్టు గానే చదివారు😀) అని అనిపించింది..ఇపుడు లెక్కలైతే అర్థమయ్యాయి గానీ..జీవితంలో ఇంకో అతి ముఖ్యమైన చిక్కుముడి విప్పలేక పోతున్నా..ఇంతకీ ఆ చిక్కు మూడేంటి? దాని కథా కమీషు..మరో ఎపిసోడ్లో..అందాకా ఉంటా మరి😍😍..

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం