బస్సాయణం

బస్సాయణం | ఫణీంద్ర కుప్పిలి

                            ముందు రోజు తెల్లవారుజాము వరకూ.. ఆఫీసు పని చేయడంతో.. ఉదయాన్నే హడావుడిగా వెళ్లే అవసరం లేకుండా.. కొంచెం లేటుగా వెళ్లే వెసులుబాటు లభించింది.. దాంతో నిదానంగా తయారయి ఆఫీసుకి బయలుదేరాను.. బండి పార్కింగ్ లో పెట్టి వస్తుండగా.. ఒక ఎక్స్ ప్రెస్ బస్సు వెళ్ళిపోతోంది.. కొంచెం పరిగెట్టుంటే.. బస్సు అందుండేది.. కానీ ఆ బస్సు వెళ్ళిపోతే వెళ్లిపోనీ.. ఎలాగూ అర్జంట్ గా వెళ్లాల్సిన పనిలేదు కదా అని.. ఏదో మొక్కుబడిగా చేయి ఎత్తి ఆపాను.. కానీ వాడు కూడా బ్రేకు వేయడానికి బద్ధకంగా ఫీలయినట్లున్నాడు.. స్లో కూడా చేయకుండానే వెళ్ళిపోయాడు😂

ఓ పది నిముషాలు.. చాలా హుషారుగా ఓ పక్క ఆర్.టి.సి బస్సుల్ని చూస్తూనే.. మరో వైపు ఏదన్నా క్యాబ్ దొరక్కపోదా అని కొంచెం మోహమాటంగానే.. ఖాళీగా వెళ్తున్న కార్లను ఆపుతున్నాను.. అదేంటో..నేను వెళ్లాల్సిన చోటుకి తప్ప మిగతా అన్ని చోట్లకీ.. ట్యాక్సీ లు దొరుకుతాయి.. నా అదృష్టం అలా తగలబడుతుంది..☺️ అలా చూస్తుండ గానే సుమారు ఓ పావు గంట.. ఇరవై నిమిషాలు గడిచిపోయాయి.. ఈలోగా ఒకటి రెండు మ్యాక్సీ క్యాబ్ లు వచ్చినా ఎక్కకుండా వదిలేసా.. అందులో ప్రయాణం ఒక ప్రత్యక్ష నరకం.. అదే మాములుగా రోజూ ఆఫీసుకు వెళ్లే టైములో అయితే.. అలస్యమయిపోతుందనే గాభరాలో ఏది దొరికితే అది ఎక్కేసి వెళ్లిపోవడమే..కానీ ఆరోజు అంత అర్జెన్సీ లేకపోవడంతో కొంచెం టెక్కు చూపించి వదిలేసా..😥

ఇలా అటూ ఇటూ తిరగడంతో సుమారుగా ఓ అర్థ గంట కాలం కర్పూరంలా కరిగిపోయింది.. నా బాధల్లో నేనుంటే.. ఇంకోపక్క.. బళ్లపై అమ్మే పళ్ళు..పూవులోళ్లు ఏదో ఒకటి కొనమని తెగ విసిగించ సాగారు.. మరోప్రక్క ఎక్కడకి వెళ్ళాలి సర్ అంటూ నసపెట్టే ఆటోవాళ్ళు.. దాంతో నాకు కొంచెం విసుగు పుట్టసాగింది..😤ఈ అర్థ గంట కాలంలో సుమారు ఓ పాతిక బస్సులు దాకా వచ్చి వెళ్లాయి..కానీ అదేంటో..నేను వెళ్లాల్సిన వైపు బస్సు మచ్చుకు ఒక్కటి కూడా రాలేదు.. ' అనవసరంగా మొదట వస్తూనే కనిపించిన బస్సుని వదిలేసా..కాస్తా పరిగేట్టుంటే అందిపోయుండే వాడిని..ఈ ఎండలో చావాల్సిన పని తప్పేది..'అని నన్ను నేను తిట్టుకో సాగాను..

ఈలోగా మెల్లగా.. పెళ్లి నడక నడుస్తూ వచ్చే పేరంటాలు లా ఓ ' తెలుగు వెలుగు..' బస్సు వచ్చింది..😆 అప్పటికే అర్థ గంట పైబడి టైం వేస్టు అయిపోవడంతో.. పైగా.. వరదల్లో చిక్కుకున్న వారికోసం విసిరే పొట్లాల కోసం ఎగబడినట్లుగా.. ఒక్కసారిగా జనాలు బస్సుపై దాడి చేశారు.. మనదసలే బక్క ప్రాణం.. అందులో దూరితే బొక్కలు ఇరిగిపోతాయనీ.. పైగా దాని'..గంట కి గజం..' స్పీడుకి😅 ఝడిసి గుండె నిబ్బరం చేసుకుని వదిలేసా..పోనీ ఏదన్నా ట్రావెల్స్ ఏ.సి బస్సు ఎక్కేద్దామా అంటే.. వాడు ఒక వైపుకే.. రెండు చెంపలు (వైపులా) వాయించేస్తాడు😬.. BMW లగ్జరీ ని 'నానో'  కార్ కాస్ట్ లో ఆశించే.. ప్రతీ రూపాయిని లెక్క చూసుకోవాల్సిన మధ్య తరగతి బానిస బ్రతుకు.. మొత్తానికి అన్ని క్యాలిక్యులేషన్లు వేసుకున్నాక🤔 మళ్ళా 'ప్రగతి(లేని) చక్రం' కై ఎదురు చూడ సాగాను..😚

అప్పుడు..అంతా అయిపోయాక.. చివరాఖరి సీన్ లో పోలీసోళ్ల ఎంట్రీలా.. మెల్లగా ఒక సూపర్ లగ్జరీ బస్సు వచ్చింది.. నిదానంగా వెళ్లే టైముని.. ఈ బస్సుల వేట..హరించేసింది. దాంతో చేసేది లేక.. అదేదో సామెత చెప్పినట్లు.. ఉసూరమంటూ ఎక్కేశా.. హమ్మయ్య అని కూర్చునే లోపు.. కండక్టర్.. వోల్వో బస్సు టికెట్ ని చేతిలో చల్లగా పెట్టాడు.. '😂😂 లోభికి ఖర్చేక్కువ.. బద్ధకిష్టికి పనెక్కువ..' అన్నట్లు.. అదేదో ముందే తెగించి ఆ ప్రయివేటు ట్రావెల్స్ ఎక్కేసుంటే.. ఆ టైముకి సమ్మగా ఏ.సీలో సగం దూరం పోయుండేవాడిని.. అయితే.. ' మెల్లా మెల్లగా వచ్చిండే..☺☺☺' సాయి పల్లవి పిలుపుతో..ఇవన్నీ మరిచిపోయి.. పాటని ఎంజాయ్ చేయడంలో మునిగిపోయా...

కొసమెరుపు ఏంటంటే.. ఎప్పటిలాగే.. చిల్లర తీసుకోకుండానే.. బస్సు దిగి.. రోడ్డు దాటబోతుంటే.. నన్ను వెక్కిరిస్తున్నట్లుగా.. ప్యాసెంజర్ బస్సు..మెల్లగా చాపకింద నీరులా సాగిపోయింది..😁😁

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం