ఇంటింటికీ మందు
...ఇంటింటికీ మందు | ఫణీంద్ర కుప్పిలి
బ్రతుకుతెరువు కోసం చాలా ఏళ్ళ కిందట వేరే రాజ్యనికి వెళ్లిపోయిన అప్పారావు.. తన సొంత ఊరికి వస్తాడు.. చాన్నాళ్ల తరువాత పాత మిత్రులందరినీ కలుసుకోడంతో.. సరదాగా సాయంత్రం మందు పార్టీ చేసుకుందామనుకుంటారు..
మనోడు మంచి హుషారుగా సాయంత్రం పార్టీకి మిత్రుని ఇంటికి బయలుదేరి వెళతాడు.. మిత్రులందరూ కాసేపు పాత ముచ్చట్లలో మునిగిపోతారు.. అప్పారావు ఉత్సాహంగా మాట్లాడుతున్నప్పటికీ పార్టీకి కావాల్సిన మందు బాటిళ్లు ఎక్కడా కనిపించక పోయేసరికి కాస్తా నిరుత్సాహం చెందుతాడు.. చివరికి ఓపిక పట్టలేక..' అరే..మందు పార్టీ అని అన్నారు..ఇక్కడ చూస్తే..ఎక్కడా బాటిల్ జాడే లేదు..ఇంతకీ ఉన్నట్టా?లేనట్టా? ' అని ఆత్రంగా అడిగే సరికి.. అక్కడున్న వారంతా ఫక్కున నవ్వారు..వాళ్లంతా అసలు ఎందుకు నవ్వారో తెలీక అప్పారావు కాస్త అయోమయంలో పడ్డాడు..తాను అడిగిన దాంట్లో నవ్వాల్సినంతగా ఏముందో అని ఆలోచించసాగాడు..
మనోడి వాలకాన్ని చూసిన అతని మిత్రులు ..' ఇంకా నువ్వు మందు పార్టీ అంటే..పూర్వం లాగా వైన్ షాపుకెళ్లి..మందు బాటిళ్లు కొనుక్కొని వచ్చి తాగాల్సిన పనిలేదు.. మనం ఆ వైన్ షాపుల చుట్టూ.. రోజూ తిరిగి కొనుక్కోచ్చకోవడం..కొన్ని సార్లు డబ్బులుంటాయి..డబ్బులుండకపోతాయి..అలాంటపుడుమనకి ఎంత కష్టం..? అలాగే మనం కొనకపోతే ప్రభుత్వానకి ఎంత నష్టం? అసలు మనం తాగకపోతే ప్రభుత్వాలు ఎలా నడుస్తాయి? అందుకే మందుబాబులు సమస్యల్ని దృష్టిలో పెట్టుకున్న మనసున్న మా మందు రాజు కొత్తగా ' ఇంటి వద్దకే మందు' పధకాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించారు..' అని చెప్పడంతో ఒక్కసారిగా అప్పారావు ముఖం హైమాస్ట్ బల్బ్ లా వెలిగిపోయింది..
మనోడి ఆసక్తిని గమనించిన అతని మిత్రుడు..' ఇందులో ఆధార్ నెంబర్ తో ఒకసారి చేరితే చాలు.. మనకు ఇంటి వద్దకే పాతిక లీటర్ల క్యాన్లలో సరఫరా చేసేస్తారు..ఇపుడు ప్రభుత్వం అమలుజేస్తున్న సంక్షేమ పథకాలలో సరుకులకు/సేవలకు బదులుగా డబ్బుని నేరుగా మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు.. ఇపుడు మనం నెలకు తీసుకున్న మందు డబ్బుల్ని మన అకౌంట్లో నుండి మినహాయించుకోగా.. మిగిలిన దానికి మనం చెల్లించుచుకోవాలి..ఇపుడు చాలా హ్యాపీగా ఉందిరా..ఇంతకు ముందులాగా ఆలిచ్చిన బియ్యాన్ని, ఇల్లు పొల్లుని అమ్ముకోడానికి ఇంటోళ్లతో గోడవపడాల్సిన పనిలేదు..' అని చెప్పడంతో తాగకుండానే..ఫుల్ బాటిల్ కొట్టినంత కిక్ ఎక్కేసింది అప్పారావుకు..
మాటలో మధ్యలోనే..'సార్ మందు..' అని గట్టిగా కేకేయడంతో..ఓ బయోమెట్రిక్ మెషీన్ లో వేలిముద్ర వేసి ఓ రెండు బాటిల్స్ ని తీసుకున్నాడు.. మందు వచ్చేయడంతో ఒక రౌండ్ వేసి.. మళ్లీ మాటల్లోకి దిగారు.. మీకు మీ రాజ్యంలో ఇటువంటి స్కీములేవీ లేవా? అని జాలిగా చూసాడు..ఈసారి అప్పారావు కి తలకొట్టేసినట్లయింది..
పుండు మీద కారం చల్లినట్లు..మరో మిత్రుడు ' ..దీనికే ఇలా అయిపోతే..అతి త్వరలో.. ఇంటింటికీ మందు...అనే ఇంతకంటే కూడా మంచి స్కీముని మా రాజు ప్రవేశపెట్టబోతున్నాడంట..' అని అనేసరికి.. అప్పారావు క్వశ్చన్ మార్కు పేసు పెట్టడంతో..అర్థం చేసుకున్న అతను ఇలా చెప్పసాగాడు..'ఇలా రోజు వారీ క్యానులను వేసుకోవడం..అయిపోతే మళ్లీ తెప్పించుకోవడం ఎందుకని.. ఇంటింటికీ మునిసిపాలిటీ ట్యాప్ మాదిరి పైప్ లైను వేసేస్తారంట..దానికో మీటరు బిగించి.. నెలనాడు బిల్లు పంపిస్తారంట..' అంటూ ఆఖరి పెగ్ ని లాగించేశాడు..కొట్టిన మందుకన్నా...ఆ స్కీములిచ్చిన కిక్కుకే ఫ్లాట్ అయిపోయాడు అప్పారావు...
15 జూలై, 2017.