ఆత్మశోధన

ఆత్మశోధన | ఫణీంద్ర కుప్పిలి

గుదిగుచ్చుకున్న భావాలు..
గువ్వల్లా ఎగిరిపోతుంటే..
గిరిగీసుకున్న జోనర్లు..
నీటి మీద వృత్తాల్లా చెరిగిపోతుంటే..
నమ్మకాల పునాదులపై నిర్మించుకున్న ఇజాలు..
పేక మేడల్లా కూలిపోతుంటే..
పెనవేసుకున్న బంధాలు
పీలికలుగా మిగులుతుంటే..

స్వప్నంలో వాస్తవంలా..
వాస్తవంలో స్వప్నంలా..

అనుక్షణం వాదిస్తూ..శోధిస్తూ..
నిజాల్ని పోస్ట్ మార్టం చేస్తూ..
అనుమానాల ముసుగుల్ని తుంచేస్తూ...
నిరంతరం ఆలోచనల కొలిమిలో
బూజు పట్టిన భావాల్ని దహించి వేస్తూ..
వైరుధ్యాల పెనుగులాటలో..
కరడుగట్టిన భావజాలాలు
తునా తునకులైపోగా..

హృదయాంతరాళాల్లో గూడు కట్టుకున్న
అజ్ఞానమనే గాడాంధకారాన్ని
ఆత్మశోధన అనే కరవాలాన్ని
ఝుళిపించి ఛేదించగా..
రేగిన అగ్గి రవ్వల వెలుతురులో..
మనో నేత్రానికి కమ్మిన పొరలు తొలగిపోగా..
కడిగిన ముత్యంలా ఆత్మ సాక్షాత్కరిస్తుంది..

మొగ్గ తొడిగిన నూతనోత్సాహంతో..
ఎల్లలు లేని ఆత్మ విశ్వాసంతో..
నిత్య సత్యాన్వేషకునిగా
జ్వలిస్తూ..చలిస్తూ..
పరమ పదాన్ని చేరుకోవాలి ఈశ్వరా..

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం